ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) మరోసారి క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. కె-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని రాసుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'K ర్యాంప్' సినిమా దీపావళికి రిలీజైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ర్యాంపేజ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట సోమవారం ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. టాలెంట్‌ను నమ్ముకుని పైకి వస్తున్న కిరణ్ అబ్బవరాన్ని పొగిడే క్రమంలో తెలుగులోని ఓ స్టార్ హీరోను కింపరిచేలా కామెంట్స్ చేశాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని.. కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ పోజులు కొడుతున్నారు.
విజయ్‌పైనే విమర్శలు
తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్‌ను తీసుకురా... అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు' అని ఎలివేషన్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్.. వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటాడు. దీంతో బండ్ల.. విజయ్‌పైనే విమర్శలు గుప్పించాడని ప్రచారం జరిగింది. కిరణ్‌ను పొగడటం తప్పు కాదు కానీ మధ్యలో విజయ్ ఏం పాపం చేశాడని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బండ్ల క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశాడు.
ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.
ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు.
మీ బండ్ల గణేష్— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025


