
రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ బెంగుళూరులోని ‘పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తనను బళ్లారి జైలుకు తరలించాలని కోరుతూ బెంగళూరు కోర్టులో దర్శన్ ఒక పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ సమయంలో కోర్టు హాలులోకి గుర్తుతెలియని వ్యక్తి ఎంట్రీ ఇచ్చి అలజడి సృష్టించాడు.
దర్శన్ పిటిషన్ బెంగళూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి కోర్టు హాల్లోకి ప్రవేశించాడు. దర్శన్, పవిత్ర గౌడలకు మరణశిక్ష విధించాలని కోరుతూ బెంగళూరు నగర కోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశాడు. వారిద్దరికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ.. మరణశిక్ష విధించడమే సరైన న్యాయం అంటూ న్యాయమూర్తిని అభ్యర్థించాడు. అప్పుడు న్యాయమూర్తి "నువ్వు ఎవరు?" అని అడిగారు. ఆ వ్యక్తి "నేను రవి బెలగెరె వైపు నుండి వచ్చాను" అని బదులిచ్చాడు. మీ దరఖాస్తు లేదా అభ్యర్థన ఏదైనా ఉంటే అది ప్రభుత్వం నుంచి రావాలని న్యాయమూర్తి సూచించారు. విచారణ సమయంలో ఇలా ప్రవేశించడం నేరం అంటూ అతన్ని మందలించారు. ఆ తర్వాత అనామిక కోర్టు నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
దర్శన్‌ను బళ్లారి జైలుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను కోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఇలా గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి అలజడి సృష్టించడంతో దర్శన్ అభిమానులు ఆందోళన చెందారు.