సినిమా హీరోహీరోయిన్లకన్నా బిజీగా ఉంటుంది యాంకర్ సుమ (Anchor Suma Kanakala). ఎప్పుడూ ఏదో ఒక షో, ఈవెంట్, ఇంటర్వ్యూ అంటూ పరిగెడుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్స్ చేసినా సరే కొంచెం కూడా అలిసిపోయినట్లుగా కనిపించదు. రోజంతా హుషారుగానే కనిపిస్తుంది, గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. యాంకరింగే కాకుండా గతంలో సినిమాలు కూడా చేసింది. అప్పుడెప్పుడో చివరగా జయమ్మ పంచాయితీ (2022) మూవీ చేసింది.
నా చెక్కు కొట్టేసింది
తాజాగా మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన 'ప్రేమంటే..' మూవీలో సుమ కానిస్టేబుల్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమా టీజర్ ఈవెంట్‌లో సుమ మాట్లాడుతూ.. ఈరోజు చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ ప్రోగ్రాం మనమే స్టార్ట్ చేస్తుంటాం. అలాంటిది ఈ రోజు యాంకర్ గీత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మన చెక్కు కొట్టేసింది. నన్ను ఈ సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు.
ఇంత మోసం చేస్తారా?
అయితే దర్శి కంటే నా వయసు మరీ తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్‌ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక అది పవర్‌ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్‌లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది?
నేనే గ్లామర్‌గా కనిపించా..
ఆనంది.. నా రోల్ కొట్టేశావ్.. అయినా ఇట్స్ ఓకే! పర్వాలేదు, బాగా చేశావు. గ్లామర్ విషయానికి వస్తే నీకంటే నేనే ఎక్కువ గ్లామర్‌గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో నాక్కూడా ఓ పాట ఉంది. అందులో ఒక హుక్‌స్టెప్ ఉంది. పాట రిలీజయ్యాక మీరందరూ ఆ హుక్‌స్టెప్ చేయాలి అంటూ సరదా స్పీచ్ ఇచ్చింది. ప్రియదర్శి-ఆనంది కాంబినేషన్‌లో వస్తున్న ప్రేమంటే సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కాబోతోంది.


