
తెరపై క్యూట్‌గా, స్టయిలిష్‌గా కనిపించే రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon)కు పండుగలంటే ప్రత్యేకమైన మమకారం. ముఖ్యంగా వినాయక చవితి ఆమె చిన్ననాటి నుంచే గుండె నిండా ముద్ర వేసుకున్న పండుగ. ఆ జ్ఞాపకాలే మీ కోసం..
👉 నేను లండన్‌లో పుట్టినా, నా బాల్యం గోవా వీధుల్లో గడిచింది. అక్కడ వినాయక చవితి అంటే ఊరంతా పండుగ మూడ్‌లో ఉంటుంది. ప్రతి వీధిలో గణపయ్య విగ్రహాలు, రంగురంగుల అలంకారాలు, పూల సువాసనలు ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి.
👉 పండుగ రోజున మోదక్‌ల సువాసన వంటింట్లో నిండిపోతే, స్వర్గం కంటే మిన్నగా అనిపించేది. నైవేద్యం పెట్టాక గణపయ్యకి ఇచ్చిన మొదటి మోదక్ తప్పనిసరిగా నేనే తింటాను. ఇది నా చిన్ననాటి నుంచి కొనసాగుతున్న రొటీన్. ఈసారి వినాయక చవితి కోసం నేను ప్రత్యేకంగా గణపయ్య విగ్రహం ఆర్డర్ చేశాను. పూలతో, దీపాలతో, మోదక్‌లతో ఇంట్లోనే శ్రద్ధగా పూజ చేస్తాను. పండుగ రోజు చీర కట్టుకోవడం మాత్రం కచ్చితంగా చేస్తాను.
👉 గణపయ్య విజయాన్ని మాత్రమే కాదు, కష్టాల నుంచి బయటపడే శక్తినీ ఇస్తాడు. అందుకే ఆయన పూజ నా జీవితంలో మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే క్రిస్మస్ కూడా నాకు ప్రత్యేకమే. మా అమ్మ క్రైస్తవురాలు. క్రిస్మస్ రోజు ఎర్రని గౌను వేసుకుని, ఫొటోలు తీసి ఫ్యాన్స్‌తో పంచుకోవడం నాకు చాలా ఇష్టం.
👉 ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. కానీ కెమెరా ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆనందం వేరే. అందుకే సినిమాల్లోనే కొనసాగుతున్నాను. నా మొదటి సినిమా కన్నడలో వచ్చింది. తర్వాత తెలుగు తెరపై నానితో కలిసి ‘కృష్ణార్జున యుద్ధం’ చేశాను. ఆ సినిమాకు వచ్చిన స్పందన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

👉 ఫుడ్ లవర్ అయినా, ఫిట్‌నెస్‌లో కాంప్రమైజ్ అవను. ఉదయం యోగా, సాయంత్రం స్విమ్మింగ్ తప్పనిసరి. చర్మం, జుట్టు కోసం పెద్దగా ఏమీ చేయను. వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె మసాజ్, రాత్రిళ్లు అలోవెరా అంతే.
👉 సినిమాలు ఎంచుకోవడంలో నేను చాలా సెలెక్టివ్. చిన్న పాత్రయినా గుర్తుండిపోయేలా ఉంటేనే చేస్తాను. ఒక ఈవెంట్‌లో ఫొటోలు తీస్తూ అసౌకర్యం కలిగించడంతో అక్కడికక్కడే ‘ఇలా చేయొద్దు’ అని ఫొటోగ్రాఫర్స్‌కి చెప్పాను. గౌరవం ఉన్న చోటే నేను సౌకర్యంగా ఉంటాను.
👉 సెట్లో ‘ప్యాక్ అప్’ అంటే చాలు– నేను కిచెన్‌లో ‘యాక్షన్’ మొదలెడతాను. గోవా ఫిష్ కర్రీ నా స్పెషాలిటీ. పాన్‌లో కర్రీ ఉడుకుతుంటే వచ్చే వాసనతో మా వాళ్లు కిచెన్ డోర్ దగ్గర క్యూ కడతారు.
👉 ప్రేమలో నా ఆలోచన సింపుల్. ముందు స్నేహం, తర్వాతే ప్రేమ. ఏదైనా టాక్సిక్ అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆగను. లైఫ్‌ను మళ్లీ రీస్టార్ట్ చేస్తాను.
👉 ప్రయాణాలు అంటే ప్రాణం. గోవా బీచ్ గాలి తాకితే నా మనసు పొంగిపోతుంది. కేరళ బ్యాక్ వాటర్స్‌లో పడవ ప్రయాణం, మసూరీ హిల్ స్టేషన్ ప్రదేశాలు అన్నీ ఫొటోల్లో కాదు, నా మదిలో ఫ్రేమ్ అయిపోతాయి.
చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా!