త్రిషకు మద్దతుగా కస్తూరి.. హీరోయిన్లు వేశ్యలా అంటూ వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

త్రిషకు మద్దతుగా కస్తూరి.. నాలుక జాగ్రత్త అంటూ మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్‌

Published Thu, Feb 22 2024 3:56 PM

Actress Kasthuri Comments On Trisha Issue - Sakshi

తమిళ నటి కస్తూరి 90వ దశకంలో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. కస్తూరి సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా తన అభిప్రాయాన్ని డైరెక్ట్‌గా చెబుతుంది. అవతల ఉండే వ్యక్తి ఎవరు ఉన్నా సరే.. తరువాత ఏమైనా కానియ్..ఐ డోంట్‌ కేర్ అనుకునే రకం ఆమె.. ఆమెలో ఉన్న డేరింగ్ తత్వం అది.

అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..  హీరోయిన్‌ త్రిషకు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగాడు.. దీంతో త్రిష కూడా అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ అంశంపై హీరో విశాల్‌ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజుపై తీవ్రంగా విరుచుక పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి కస్తూరి కూడా అతనిపై ఫైర్‌ అయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్‌ సినిమా.. ఆ సాంగ్‌ స్పెషల్‌)

ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. నోరు, నాలుకలు ఉంటే సరిపోదు.. మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ది కూడా ఉండాలి. కొద్దిరోజుల క్రితం త్రిషపై  మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలే చేశాడు.. మళ్లీ ఇప్పుడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై నీచమైన కామెంట్లు చేశాడు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. మీ రాజకీయ పార్టీలోని వ్యక్తులతో సమస్యలు ఉంటే అక్కడ చూసుకోకుండా ఇలా త్రిష పేరును తెరపైకి తీసుకొచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయం ఏంటి..? 

మీలాంటి వారికి మేము ఎలా కనిపిస్తున్నాం..? సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..? సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలకు అమ్మానాన్నలు ఉంటారనే ఆలోచన కూడా లేకుండా పోయిందా..? కనీసం వారి గురించి అయినా ఆలోచించరా..? ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి. ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్లు చేసే అధికారం మీకు ఎవడు ఇచ్చాడు..? ఎవరో చెప్పారు చెప్పారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? మీ వద్ద ఆదారాలు ఉంటే బయట పెట్టండి.

రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మీకు ఉన్న గౌరవం పోతుంది. ఇలాంటి వారి వల్ల సమాజం కోసం పనిచేసే రాజకీయ నాయకులకు కూడా చెడ్డపేరు వస్తుంది.  పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను కూడా అధిగమించి తమ కుటుంబాల కోసం ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి మహిళలు వచ్చేదే తక్కువ.. పరిశ్రమలో అడుగుపెట్టాలంటే చాలా  ధైర్యం ఉండాలి. కానీ సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే ఎలా..?

తమిళనాడులో అందరూ అమ్మగా పిలిచి అభిమానించే నాయకురాలు జయలలిత గారు. ఆమె కూడా నటిగా,మహిళగా, ముఖ్యమంత్రిగా వెలుగొందారనే విషయం మరిచిపోయారా..? ఆమె సారథ్యం వహించిన పార్టీలో ఇలాంటి వ్యక్తికి స్థానం ఇవ్వడం ఏంటి..? ఇప్పుడు జయలలిత ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా..? ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతుంది.' అని కస్తూరి అన్నారు.

Advertisement
 
Advertisement