అభిమానులతో సూర్య విందు.. ఎందుకో తెలుసా..? | Sakshi
Sakshi News home page

అభిమానులను విందుకు ఆహ్వానించిన సూర్య.. ఎందుకో తెలుసా..?

Published Mon, Mar 4 2024 7:40 AM

Actor Surya Gave Party His Fans - Sakshi

గత ఏడాది డిసెంబర్‌ నెలలో తమిళనాడును మిచాంగ్‌ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా నిలిచిన ఫ్యాన్స్‌ అందరినీ సూర్య కలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి సహా దక్షిణాది జిల్లాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది సామాన్య ప్రజలు తినేందుకు ఆహారంతో పాటు దుస్తులు లేక తీవ్రమైన అవస్థలు పడ్డారు.

ఆ సమయంలో ప్రభుత్వం కూడా తక్షణమే అనేక సహాయకచర్యలు ప్రారంభించింది. సామాన్య ప్రజల ఇబ్బందులను చూసి చలించిన కోలీవుడ్‌ బ్రదర్స్‌ సూర్య, కార్తీలు వెంటనే రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను తగ్గే వరకు ఆ ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.. ఇవన్నీ చేయాలంటే సరైన వర్కర్స్‌ కావాలి.. అప్పుడు సూర్య తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన అభిమానులు తుపాను తగ్గేవరకు పలు సేవలు చేశారు.

అభిమానులు చేసిన సేవను గుర్తించిన సూర్య.. వారందరీని ఒక్కసారి కలుసుకోవాలని ఆహ్వానించి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో తుపాను కారణంగా నష్టపోయిన ప్రజల కోసం పనిచేసిన సూర్య అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ స్వయంగా సూర్య కాల్‌ చేసి పిలిచారు. వారందరికి శాఖాహార విందును ఆయన ఏర్పాటు చేశారు. తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే వారితో కలిసి ఫోటో దిగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటుడు సూర్య. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య 'కంగువా'లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement