ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమయంలో నటుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఫౌజీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సుధీర్ బాబు కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు దర్శన్‌కు ఫౌజీలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గూఢచారి-2లో కూడా దర్శన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అయితే, ఈ వార్తల గురించి ఫౌజీ యూనిట్, సుధీర్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'లో కూడా ఓ చిన్న పాత్రలో చరిత్ నటించారు. గతంలో తను పలు సినిమాల్లో మెరిశాడు. భలే మగాడివోయ్ సినిమాలో జూనియర్ నానిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత విన్నర్ సినిమాలో జూనియర్ సాయిధరమ్ తేజ్‌గా కనిపించాడు. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుదీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.


