
ప్రముఖ టాలీవుడ్ హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) వయస్సు, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి నేర్పిన పాఠాల ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నానని గతంలో రవితేజ తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో రాజగోపాల్ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యహ్నం 3 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు, మరో కుమారుడు రఘు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. తన ఉద్యోగం కారణంగా ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఆయన గడిపాడు. దీంతో రవితేజ పాఠశాల విద్య 'జైపూర్ , ఢిల్లీ , ముంబై భోపాల్'లలో జరిగింది. అందువల్ల రవితేజ చిన్నప్పటి నుంచి వివిధ యాసలు, సంస్కృతులు నేర్చుకున్నాడు. ఇది ఆయన నటనకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని పరిశ్రమలో పలువురు చెబుతారు.
సంతాపం తెలిపిన చిరంజీవి
హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సోదరుడు రవి తేజ తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. రవితేజను ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటాడని, హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు చిరు పేర్కొన్నారు. రాజగోపాల్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.