
నటుడు అజిత్ ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కారు రేస్‌పై దృష్టి సారిస్తున్న అజిత్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఈ హిట్ కాంబినేషన్ రూపొందనున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
కాగా ఈ చిత్రానికి అజిత్ పారితోషికమే తీసుకోకుండా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగని ఫ్రీగా నటించడం లేదు.. అజిత్, నిర్మాత రాహుల్ ఒక డీల్ చేసుకున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ డీల్ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్ హక్కులను అజిత్‌కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అజిత్ ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇంతకుముందు వరకు కొంత పారితోషికంతో పాటు ఒకటి రెండు ఏరియాల హక్కులను కోరే హీరోలు ఇకపై అజిత్‌లా ఓటీటీ, డిజిటల్ హక్కులు కోరతారేమో.