ప్రయాణాలు
జూన్‌లో అమలుకు ఆర్టీసీ కసరత్తు
రామాయంపేట(మెదక్): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఆధార్ కార్డు చూపించి వెళ్లేవారు, ఇక నుంచి వారికి చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో సమయం ఆదాతో పాటు నకిలీ గుర్తింపు కార్డులను అరికట్టవచ్చని భావిస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ కార్డులను అమలులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ డిపోలు కొనసాగుతున్నాయి. ఈరెండు డిపోల పరిధిలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన 2023 డిసెంబర్ నుంచి ఈనెల 29 వరకు మొత్తం 4.16 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగించారు. ఈ మేరకు రెండు డిపోల్లో వీరు ప్రయాణం ద్వారా మొత్తం రూ.148.37 కోట్ల మేర పొదుపు చేయగలిగారు.
దుర్వినియోగానికి అడ్డుకట్ట
నకిలీ కార్డులతో కొందరు మహాలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకరి ఆధార్ మరొకరు చూపడం, ఒరిజనల్ కాకుండా డూబ్లికేట్ కార్డు చూపుతూ ప్రయాణించడం వంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం నకిలీ కార్డులతో ప్రయాణిస్తుండటాన్ని ఇటీవల గుర్తించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొన్ని ఆధార్ సెంటర్లలో డబ్బులు తీసుకొని పేర్లు, చిరునామా మారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏటీఎం తరహా చిప్‌తో..
మహాలక్ష్మి పథకం కింద త్వరలో చిప్‌తో కూడిన డిజిటల్ కార్డులు మహిళలకు అందించనున్నారు. జిల్లాలో ఒకేసారి అందరికి కాకుండా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన మండలంలో ఈపథకాన్ని ముందుగా అమలుపర్చనున్నారు. తద్వారా రెండు డిపోల పరిధిలో మహిళా ప్రయాణికులకు కార్డులు అందనున్నాయి. ఈ కార్డులు అమలులోకి వచ్చిన తర్వాత ఆధార్ ఉచిత ప్రయాణం రద్దువుతుందని, కొత్త కార్డు చూపాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని రెండు డిపోల పరిధిలో నిత్యం 70 వేల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అంచనా.
విడతల వారీగా మహిళలకు పంపిణీ
విధి విధానాలు రాలేదు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై తమకు ఇంకా విధి విధానాలు రాలేదు. కొత్త కార్డులు వచ్చే వరకు మహిళలు ఆధార్ కార్డులు చూపించి బస్సుల్లో ప్రయాణాలు కొనసాగించవచ్చు.
– సురేఖ, మెదక్ డిపో మేనేజర్
డిపో మహిళల పొదుపు
మెదక్ 3.23 కోట్లు రూ.119.13 కోట్లు
నర్సాపూర్ 96 లక్షలు రూ.30.14 కోట్లు


