టెట్‌ పాసయ్యేదెట్టా..! | - | Sakshi
Sakshi News home page

టెట్‌ పాసయ్యేదెట్టా..!

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

సుప్రీం తీర్పుతో గురువుల్లో గుబులు

మూడేళ్ల గడువు కాస్త ఊరట

జిల్లాలో 3,796 మంది

ఉపాధ్యాయులు

మెదక్‌ అర్బన్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్‌ రాసి నిర్ణీత సమయంలో అర్హత సాధించాల్సిందేనని శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గురువుల్లో గుబులు మొదలయ్యింది. అయితే టెట్‌ పాస్‌ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మూడేళ్లకు అంటే 2027 ఆగస్టు 31 వరకు పొడిగించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా కాలపరిమితి ఉన్న టీచర్లు, ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాల్సిందేనని 2025 సెప్టెంబర్‌ 1న ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా టీచర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీంతో 69 ఉపాధ్యాయ సంఘాలు గతేడాది అక్టోబర్‌ 12న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం ఈమేరకు తీర్పునిచ్చింది.

జిల్లాలో మొత్తం 3,796 టీచర్లు ఉండగా, 1,752 మంది టెట్‌ పాసయ్యారు. ఇంకా 2,044 మంది పాస్‌ కావాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ తప్పని సరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011లో మొదటిసారి టెట్‌ నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు గాను ఓసీలు 90, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 60 మార్కులు సాధిస్తేనే పాస్‌ అవుతారు. అంతకు ముందు డీఎస్సీల ద్వారా టీచర్ల నియామకం చేపట్టేవారు. ఎస్జీటీ టీచర్లకు ఇంటర్‌తో పాటు టీటీసీ, స్కూల్‌ అసిస్టెంట్‌లకు డిగ్రీతో పాటు బీఈడి పాస్‌ అయిన వారు అర్హులుగా ఉండేవారు. అయితే ఉత్తర్వులతో వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోతారని, దాని వల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందని టీచర్లు ఆందోళళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెట్‌ పరీక్షలను ఏడాదిలో కనీసం 2 పర్యాయాలు నిర్వహించాలని, అర్హులైన టీచర్లు అర్హత సాధించేందుకు సహేతుకమైన అవకాశాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

అనుత్తీర్ణులు 2,044 మంది

Advertisement
 
Advertisement
Advertisement