నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి, సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి రైతులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ మార్కెట్ కమిటీలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు నిరంతరం వరి పంటలు సాగు చేస్తూ, మోతాదుకు మించి యూరియా వాడుతున్నారని తెలిపారు. దీంతో భూసారం పూర్తిగా కోల్పోతుందన్నారు. పంట మార్పిడితో పాటు సేంద్రియ ఎరువులను వాడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. బ్యాంకులు, సహకార సంఘాలు అందించే రుణాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, ఆయా బ్యాంకుల మేనేజర్లు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి


