చెరువులు చెరబడుతుండ్రు | - | Sakshi
Sakshi News home page

చెరువులు చెరబడుతుండ్రు

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

● అడ్డూఅదుపులేని అక్రమార్కుల దందా ● తాజాగా పిట్ల చెరువు సైతం మాయం! ● చోద్యం చూస్తున్న అధికారులు

యథేచ్ఛగా కబ్జా
● అడ్డూఅదుపులేని అక్రమార్కుల దందా ● తాజాగా పిట్ల చెరువు సైతం మాయం! ● చోద్యం చూస్తున్న అధికారులు

భూముల ధరలకు రెక్కలు రావడం.. రోజురోజుకు పట్టణ విస్తీర్ణం పెరుగుతుండటంతో చెరువులు సైతం కబ్జాకు గురవుతున్నాయి. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని చెరువులనే మాయం చేస్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అధికారుల అండతోనే చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

– మెదక్‌జోన్‌

జిల్లా కేంద్రంలో మల్లెంచెరువు, బంగ్లా, పిట్లం, గోసముద్రం, నాయకుని చెరువులు ఉన్నాయి. ఈ ఐదు చెరువులను నిజాంపాలనలో గొలుసుకట్టుగా తవ్వారు. ఒప్పుడు వీటిద్వారా వందలాది ఆయకట్టు భూములకు నీరందడమేకాక భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య తీర్చాయి. కాగా పట్టణ విస్తీర్ణం పెరగుతుండటంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. ఇప్పటికే మల్లెం చెరువు, బంగ్లా చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకోగా తాజాగా పిట్లం చెరువుపై అక్రమార్కులు వల విసిరారు. చెరువు శిఖాన్ని పూడుస్తూ ఆక్రమించే పనిలో నిమగ్నమవడం గమనార్హం.

కొనసాగుతున్న ఆక్రమణలు

జిల్లా కేంద్రంలో ఐదు చెరువులు ఉండగా వాటిలో ఇప్పటికే రెండు చెరువులను అక్రమార్కులు ఆక్రమించి రూపురేఖలే మార్చారు. తాజాగా మరో చెరువును ఆక్రమిస్తున్నారు. వీటిలో ప్రధానంగా మల్లెం చెరువు చాలా వరకు కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఈ చెరువు శిఖం భూమి 31 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 10 ఎకరాలకు వరకు ఆక్రమించి అందులో ఇళ్లు నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లెం చెరువు ఇళ్ల నిర్మాణానికి నిలయంగా మారింది. అధికారులు మాత్రం 5.20 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెబుతున్నారు. అలాగే బంగ్లా చెరువులోని బఫర్‌జోన్‌లో కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి తన పట్టా భూమి అంటూ బఫర్‌జోన్‌ను ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. దానిని రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ సర్వే చేయగా సదరు వ్యక్తి నిర్మించిన ప్రహరీ బఫర్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి తొలగించారు. అలాగే పట్టణ నడిబొడ్డున గల పిట్లం చెరువు శిఖం భూమి 105 ఎకరాలు ఉండగా, దాని ఆయకట్టు 300 ఎకరాల పైచిలుకు ఉంది. కొన్నేళ్లక్రితం ఓ వ్యక్తి బఫర్‌జోన్‌ను ఆక్రమించారు. దీంతో సదరు వ్యక్తికి ఇరిగేషన్‌ అధికారులు నోటీస్‌లు ఇచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోవ్యక్తి ఏకంగా శిఖంభూమిలో మట్టిపోస్తూ చెరువును కబ్జా చేస్తున్నారు. దీంతో పక్కనే ఉన్నా సదరు కలప మిషన్‌ వ్యక్తి సైతం కొంత బఫర్‌జోన్‌ పరిధిని ఆక్రమించి తన అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇలా ఒకరిని చూసీ మరొకరు ఆక్రమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అంతే కాకుండా పట్టణ నడి మధ్యలోనుంచి వెళ్తున్న మహబూబ్‌నగర్‌(ఎంఎన్‌) కెనాల్‌ కట్టకు సంబంధించిని బఫర్‌జోన్‌ పరిధిని ఆక్రమించి కొందరు భవనాలను నిర్మించారు. ఇలా జిల్లా కేంద్రంలో నీటి వనరులను పోటీపడి ఆక్రమిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం

చెరువులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో ఇప్పటికే కొన్ని చెరువులను ఆక్రమించగా ఆక్రమార్కుల నుంచి విడిపించాం. తాజాగా జరిగిన ఆక్రమణలు మా దృష్టికి రాలేదు. పరిశీలించి శాఖాపరమైనా చర్యలు తీసుకుంటాం.

– నాగరాజు, ఇరిగేషన్‌ డీఈ మెదక్‌

Advertisement
 
Advertisement
Advertisement