రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

కొల్చారం(నర్సాపూర్‌): పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన సిబ్బంది రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవన ఎరువులతోపాటు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వరి పంట రకాలపై రైతులకు వివరించారు.యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల బోధన సిబ్బంది లక్ష్మణరావు, నీమ, కేవీకే శాస్త్రవేత్త రవికుమార్‌, సర్పంచ్‌ స్వర్ణలత, ఉప సర్పంచ సురేష్‌, ఏఓ శ్వేతా కుమారి, ఏఈఓ రాజశేఖర్‌ గౌడ్‌, వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

బాలికల సంరక్షణ

అందరి బాధ్యత

జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య

టేక్మాల్‌(మెదక్‌): బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ రియాజొద్దిన్‌ అధ్యక్షతన బాలికల సంరక్షణ, మహిళాభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్‌ ప్రాంగణంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీపీఓ మాట్లాడుతూ చిన్న వయస్సులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయన్నారు. బాల్య వివాహలు చేసుకోవద్దని, అరికట్టాల్సిన బాధ్యత అందరు తీసుకోవాలన్నారు. బాలికలు లక్ష్యంతో చదువుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ తులసీరాం, వైద్యాధికారిణి డాక్టర్‌ హర్షిత, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ సుధాకర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ దేవ్‌దాస్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేష్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, నాయకులు పాపయ్య, భాస్కర్‌, సాయిబాబ, బాలకృష్ణ, ఆయా శాఖ ల అధికారులు, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

492 గ్రామాల్లో

మే డే ఉత్సవాలు

సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం

మెదక్‌ కలెక్టరేట్‌: సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడి కార్మిక హక్కులు కాపాడుకుందామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవన్‌ వద్ద మేడే కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన జిల్లాలోని 492 గ్రామాలలో మేడే ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక చట్టాలను, 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారని ఆయన గుర్తు చేశారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు మే డే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడు రోజులపాటు కార్మిక నాయకుల అమరవీరుల స్తూపాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేడే వారోత్సవాలను గ్రామ స్థాయిలో ఉన్న కార్మిక వర్గం అంగన్‌వాడి, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీ, మధ్యాహ్న భోజనం కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement