కో ఆప్షన్‌లో కుటిలం! | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌లో కుటిలం!

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

ఏడుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను లాగేసుకున్న కాంగ్రెస్‌ నాలుగు కో ఆప్షన్లు కై వసం ప్రత్యర్థి వ్యూహం ముందు బిత్తరపోయిన బీఆర్‌ఎస్‌

మెదక్‌ అర్బన్‌: బల్దియా కో ఆప్షన్‌ ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ కుటిల ఎత్తుల ముందు బీఆర్‌ఎస్‌ చిన్నబోయింది. ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి కాంగ్రెస్‌ పార్టీ వేసిన మాయో పాయ పాచికలకు బోర్లాపడింది. నమ్ముకున్న వారే బీఆర్‌ఎస్‌ను నట్టేట ముంచడంతో యుద్ధం చేయకుండానే ఆపార్టీ అస్త్రసన్యాసం చేసేసింది. సోమవారం జరిగిన బల్దియా రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు నిలువుటద్దంలా నిలిచాయి. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లను కాంగ్రెస్‌ పార్టీ లాగేసుకోవడంతో నాలుగు కో ఆప్షన్‌ పదవులు హస్తగతమయ్యాయి. కో ఆప్షన్‌ పదవి కోసం గులాబీ దళం నుంచి నామినేషన్‌ వేసిన ఓ అభ్యర్థి.. ఏకంగా ప్రత్యర్థులతో మిలాఖత్‌ కావడంతో దిక్కుతోచని స్థితిలో బీఆర్‌ఎస్‌ మిగతా ముగ్గురిని గైర్హాజరు చేయించి ఊరట చెందింది. ఒకవైపు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు కో ఆప్షన్‌ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చడంతో పార్టీ వర్గాలు ఆవేదనకు లోనయ్యాయి.

అడుగు దూరం నుంచి..

మెదక్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధికంగా 15 కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. తదనంతర పరిణామాల్లో ఆమడ దూరానికి పరిమితమైంది. 14 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌.. రోజు రోజుకు తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఆరంభించింది. రెండు నెలల్లోపే గులాబీ తమ్ముళ్లు..పార్టీకి గుడ్‌బై చెప్పి, హస్తం గూటికి చేరిపోయారు. ఒక్కొక్కరుగా ఏడుగురూ పార్టీని వీడారు. కనీసం కో ఆప్షన్‌ బరిలోకి దిగి ఉనికి చాటుకోవాలని నాలుగు పదవులకు బీఆర్‌ఎస్‌ నలుగురితో నామినేషన్‌ వేయించింది. కాగా, ఎన్నికకు ముందే జయరాజ్‌ అనే అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో జరుగుతున్న పరిణామాలతో పార్టీ నాయకత్వం ఖుదేలయ్యింది.

గైర్హాజరు అస్త్రం

ఈ నెల 27న జరిగిన కో ఆప్షన్‌ ఎన్నికకు కాంగ్రెస్‌..బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు గైర్హాజరు అస్త్రాన్ని ఎంచుకున్నాయి. కాగా, ఒక పార్టీ విజయాన్ని..మరో పార్టీ పరువును నిలుపుకున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఏడుగురు కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజర్‌ అయ్యారు. అప్పటికే కాంగ్రెస్‌కు బీఎస్పీ అభ్యర్థితో కలసి 15 సభ్యులు ఉండగా, ఎమ్మెల్యే ఓటు ఉండటంతో మెజార్టీపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి కో ఆప్షన్‌కు నామినేషన్‌ వేసిన ఒక అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన కొర్వి రాములు, రాగి వనజ, తాహెర్‌ అలీ, అనూష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో మిగిలిన 8 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియకు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement