బదిలీలకు పీటముడి! | - | Sakshi
Sakshi News home page

బదిలీలకు పీటముడి!

Apr 28 2026 8:52 AM | Updated on Apr 28 2026 8:52 AM

80 శాతం మంది విధుల్లోనే.. గెజిటెడ్‌ హెచ్‌ఎంలకు తప్పని తిప్పలు జిల్లాలో 3,551 ఉపాధ్యాయులు

టీచర్ల బదిలీలకు జనగణన అడ్డంకిగా మారింది. దాదాపు 80 శాతం మంది ఆ విధుల్లోనే ఉన్నారు. మొదటి దశ మే 11 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, 2027 మార్చి వరకు విధుల్లో ఉన్న వారిని బదిలీ చేయొద్దని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో టీచర్లలో అయోమయం నెలకొంది. ముఖ్యంగా జిల్లాలు దాటి వచ్చిన మహిళా గెజిటెడ్‌ హెచ్‌ఎంలు దూరభారంతో సతమతమవుతున్నారు. కాగా జిల్లాలో 3,551 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

– మెదక్‌ అర్బన్‌

టీచర్లకు జనగణన పీటముడిగా మారింది. నిబంధనల ప్రకారం మొదటిసారి ఇళ్ల గణాంకాల్లో పాల్గొన్నవారే, రెండోసారి వ్యక్తిగత వివరాల సేకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో మేలో బదిలీలు జరిపితే సుదూర ప్రాంతాలకు వెళ్తే వారు తిరిగి రావడం కష్టం కావడంతో బదిలీలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా టీచర్లు రెండేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు బదిలీకి అర్హులు. గెజిటెడ్‌ హెచ్‌ఎంలు అయితే ఐదేళ్లు, ఇతర టీచర్లు 8 ఏళ్లు ఒకేచోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. గతంలో 2018 జూలైలో ఒకసారి, 2024 జూన్‌లో మరోసారి బదిలీలు జరిగాయి. అయితే 2026 జూలైలో ట్రాన్స్‌ఫర్లు చేపడితే 2018లో బదిలీపై వచ్చిన వారికి 8 ఏళ్లు నిండుతాయని, తద్వారా ఎక్కువ మందికి బదిలీ అవకాశం దక్కుతుందని టీచర్లు అంటున్నారు. జూలై 31ని కటాఫ్‌గా నిర్ణయించి, ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించాలని కోరుతున్నాయి. కాగా గెజిటెడ్‌ హెచ్‌ఎం కేడర్‌ మల్టీజోన్‌ పోస్ట్‌ కావడంతో 2023లో ప్రమోషన్లు ఇచ్చినప్పుడు, ఖమ్మం, హనుమకొండ, కొత్తగూడెం, భద్రాద్రి, వరంగల్‌ తదితర జిల్లాల నుంచి హెచ్‌ఎంలు ప్రమోషన్‌పై మెదక్‌ జిల్లాకు వచ్చారు. ఇందులో మహిళలు చాలా మంది ఉన్నారు. కుటుంబాలకు దూరమై ఇక్కడ విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.

టీచర్లకు అడ్డంకిగా మారిన జనగణన

Advertisement
 
Advertisement
Advertisement