● అదనపు కలెక్టర్ నగేశ్ ● ప్రజావాణికి 80 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై ప్రజావాణిలో 80 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు కరాటే కోచ్‌ను నియమించకుండా నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.


