ఓటెత్తారు | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తారు

Feb 12 2026 11:35 AM | Updated on Feb 12 2026 11:35 AM

ఓటెత్తారు

ఓటెత్తారు

ప్రశాంతంగా ‘పుర’ పోలింగ్‌

జిల్లావ్యాప్తంగా 81.09 శాతం నమోదు

రామాయంపేటలో అత్యధికం

అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు

మెదక్‌జోన్‌: మున్సిపల్‌ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 81.9 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలోని మెదక్‌, రామాయంపేట, నర్సాపూర్‌, తూప్రాన్‌ బల్దియాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగగా, క్యూలైన్‌లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో రాత్రి 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. 75 వార్డులకు గానూ మెదక్‌లో ఒక్క వార్డు ఏకగ్రీవం కాగా, మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. మెదక్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లోకి దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ మైనర్‌ బాలుడిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 13వ వార్డులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 86,109 మంది ఓటర్లు ఉండగా, 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా రామాయంపేట బల్దియాలో 84.84 శాతం నమోదు కాగా, తూప్రాన్‌లో 81.30 శాతం మూడో స్థానంలో మెదక్‌ 80.75, అతితక్కువగా నర్సాపూర్‌లో 73.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉద్రిక్తత..లాఠీచార్జి

నర్సాపూర్‌: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం అర్థరాత్రి పట్టణంలోని 10, 11 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ మొదలై పెద్దగా కావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కాగా అదే రాత్రి పట్టణంలోని 4, 5 వార్డులలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ జరగగా, పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా బుధవారం పోలింగ్‌ ప్రారంభమైన అనంతరం పట్టణంలోని 15వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు ఆంజనేయులుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు భిక్షపతిలతో పాటు వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అలాగే 8వ వార్డులో ఇరువర్గాల మధ్య గొడవ జరగగా పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఆయా ఘటనలకు సంబంధించి ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.

పోలింగ్‌ సరళి ఇలా..

మున్సిపాలిటీ మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు శాతం

మెదక్‌ 35,879 28,975 17,049 18,830 80.75

నర్సాపూర్‌ 16,876 13,257 8,219 8,657 73.61

రామాయంపేట 13,095 11,110 6,291 6,804 84.84

తూప్రాన్‌ 20,259 16,470 9,957 10,302 81.30

పోలింగ్‌ శాతం ఇలా...

ఉదయం 9 గంటల వరకు : 13.65 %

ఉదయం 11 గంటల వరకు : 35.94%

మధ్యాహ్నం 1 గంట వరకు : 57.88%

మధ్యాహ్నం 3 గంటల వరకు : 71.65%

పోలింగ్‌ ముగిసే సమయానికి : 81.09%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement