ఎవరి ధీమా వారిదే..
మెదక్‌జోన్/నర్సాపూర్: ‘పుర’ పోరుకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. అలాగే చైర్మన్ పీఠాలపై పలువురు దృష్టి సారించారు. నాలుగు బల్దియాలు మహిళలకే కేటాయించడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన మహిళలు చైర్మన్‌గా తానంటే తానంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు.
4 బల్దియాలు.. 24 మంది ఆశావహులు
జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రధాన పార్టీల కు చెందిన 24 మంది చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మిగితా 31 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఓ వ్యక్తి తన కోడలును కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దింపారు. కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులకు సైతం ఎన్నికల ఖర్చుకు డబ్బులు సమకూర్చి మద్దతు కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. మరో మహిళా అభ్యర్థి, సిట్టింగ్ కౌన్సిలర్, ప్రస్తుత అభ్యర్థి సైతం తానే చైర్మన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు, బీజేపీ నుంచి ఒకరు చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. నర్సాపూర్ బల్దియా నుంచి చైర్మన్ పీఠాన్ని నలుగురు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఒకరు, బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మహిళలు పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి ఒకరు ఆశిస్తున్నారు. కాగా ఇక్కడ బీఆర్‌ఎస్‌లోనే చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొంది. ఇక తూప్రాన్‌లో చైర్మన్ పీఠం కోసం 9 మంది ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్ నుంచి 5 గురు మహిళలు పోటీ పడుతుండగా, బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరు తానేనంటూ చెప్పుకుంటున్నారు. రామాయంపేటలో ఐదుగురు మహిళలు పోటీ పడుతున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున పోటీ పడుతున్నట్లు తెలిసింది. కాగా కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఓ నేత తన కూతురును బరిలో దింపారు. మెజార్టీ వస్తే తానే చైర్మన్ అంటూ చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న మరో మహిళా అభ్యర్థి ఇప్పటికే పలు పదవులు చేపట్టిన సీనియర్ నేతల సైతం చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఒకరు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు.
16న ఎన్నిక
మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న ముగియనుండగా, 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా మెజార్టీ వచ్చిన పార్టీలు ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాలుగు బల్దియాల్లో 24 మంది పోటీ పడుతుండగా, అందులో ఆ నలుగురు అదృష్ట జాతకులు ఎవరో వేచి చూడాల్సిందే.
‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి


