ఇంటి నుంచే యూరియా బుకింగ్
● ఈనెల 20 నుంచి అందుబాటులోకి యాప్
● యాసంగికి 25,329 మెట్రిక్ టన్నులు
● 3.20 లక్షల ఎకరాల్లో పంటలు
మెదక్ అర్బన్: ఇక యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పని లేదు. రైతు ఇంటి నుంచి మైబెల్‌లో యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌ను ఈనెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు.. వరి పంట అవశేషాలను కాల్చడం కలిగే పర్యావరణ సమస్యలను వివరించనున్నారు.
ప్రత్యేక యాప్‌తో సరఫరా
వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతు డీలర్ల వద్ద యూరియా ఉన్న స్టాక్ వివరాలు తెలసుకోవచ్చు. తనకు ఇష్టమైన డీలర్ నుంచి బుక్ చేయాలి. వెంటనే ఐడీ వస్తుంది. ఇందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూ రియా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా పరిమితికి మించి యూరియా వాడకుండా, పక్క దారి పట్టకుండా చూడొచ్చు.
ఎలా బుక్ చేయాలి
● మొబైల్‌లో ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే, రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి.
● లాగిన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి.
● పాస్‌బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి.
● సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది.
● యూరియా బుక్ చేసిన తర్వాత, 15 రోజుల్లో 4 దశల్లో యూరియా అందుతుంది.
● పాస్‌బుక్ లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆప్షన్‌లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు.
కృత్రిమ కొరతను నివారించవచ్చు
వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతు నేరుగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏయే డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల పంట విస్తీర్ణానికి కనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి యూరియా తీసుకునే అవకాశం లేదు. కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండదు. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి
ఇంటి నుంచే యూరియా బుకింగ్


