ఓటెత్తిన పల్లె జనం
● మూడో విడతలో 90.67 శాతం పోలింగ్
● ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
ఎల్లాపూర్‌లో ఓటు వేసిన మహిళలు
మెదక్‌జోన్: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు స్ఫూర్తి చాటారు. బుధవారం పో లింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఏడు మండలాల పరిధిలో మొత్తం 1,62,348 ఓట్లు ఉండగా, 1,42,207 ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన 90.67 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట ఏడు మండలాల పరిధిలో జరిగాయి. 183 జీపీలు, 1,528 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 22 జీపీలు 307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 161 పంచాయతీలతో పాటు 1,221 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జంట నగరాలకు వలస వెళ్లిన వారు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు వేశారు. కాగా పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కౌడిపల్లి, కొల్చారంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన
మెదక్ కలెక్టరేట్: మూడో విడతలో 7 మండలా ల పరిధిలో 161 గ్రామాల్లో పోలింగ్ జరగగా, 43 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించి అధికారులకు తగు సలహాలు, సూచనలు చేశారు.


