మందు.. విందు!
రామాయంపేట(మెదక్): సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా విందులకు తెరలేపారు. మొదటి విడత ఎన్నికలు గురు వారం పూర్తి కాగా, రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా కులాలవారీగా విందులు ఇస్తున్నారు.ఇందుకోసం ఏకంగా హోటళ్లలో ఖాతాలు తెరిచారు. పెద్ద పంచాయతీలు, పరిశ్రమలు ఉన్న పంచాయతీల్లో ఎన్నికలు మరీ హాట్‌గా మారాయి. ముందు జాగ్రత్తగా అభ్యర్థులు పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లా పరిధిలో పలు చోట్ల సివిల్ పోలీసులతో పాటు ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఇప్పటికే రూ. 25 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ క్వార్టర్, హాఫ్ మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో నాలుగైదు కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఫుల్‌బాటిల్‌తో పాటు చికెన్ అందజేస్తున్నారు. ఒక వర్గం వారు క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తే.. మరో వర్గం వారు రెండు క్వార్టర్లు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు మందు బాటిల్‌తో పాటు చికెన్, కొంత నగదు ఇచ్చేలా అభ్యర్థులు పథకం రూపొందించినట్లు తెలిసింది.
ఇంటింటికీ మద్యం బాటిళ్ల పంపిణీ
రసవత్తరంగా
పంచాయతీ ఎన్నికలు
ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు


