రెండో విడతకు రెడీ
పోలీసుల గట్టి నిఘా
రేపు 8 మండలాల పరిధిలో ఎన్నికలు
● 142 సర్పంచ్, 1,036 వార్డుల స్థానాలకు పోలింగ్
● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండో విడతకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 8 మండలాల పరిధిలోని 142 సర్పంచ్‌లతో పాటు 1,036 వార్డులకు ఈనెల 14న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తయింది. – మెదక్‌జోన్
జిల్లాలో రెండో విడతలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి, మెదక్ నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ కలిపి మొత్తం 8 మండలాల పరిధిలోని 149 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నిక లు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 7 పంచాయతీలతో పాటు 254 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 142 సర్పంచ్, 1,036 వార్డు స్థానాలకు ఈనెల 14న రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
విధుల్లో 3,126 మంది సిబ్బంది
రెండో విడత ఎన్నికలకు 3,126 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ప్రిసైడింగ్ అధికారులు 1,246 మంది, ఏపీఓలు 1,457, రిటర్నింగ్ (ఆర్‌ఓలు) 143 మందితో పాటు అదనంగా మరో 280 మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
సమస్యాత్మక జీపీల్లో వెబ్‌కాస్టింగ్
8 మండలాల పరిధిలోని 147 గ్రామాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా వీటిలో 34 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీ స్ ఉన్నతాధికారులు, ఆ గ్రామాల్లో పోలిగ్ ముగిసే వరకు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆ గ్రామాల్లోని పోలింగ్‌స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్‌లో ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు.
రెండో విడతలో జరుగనున్న గ్రామా ల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అదనపు ఎస్పీ, ఎస్పీలు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవే క్షిస్తూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెట్టనున్నారు.


