చలికాలం.. జరభద్రం
● జాగ్రత్త చర్యలు తప్పనిసరి
● ‘సాక్షి’తో డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దృష్టి సారించాల్సి ఉంది. పిల్లలు, వృద్ధులు ఆరోగ్యసూత్రాలు పాటించాలని, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ సూచించారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
వాకింగ్ అలవాటు చేసుకోవాలి
చలికాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కాలంలో శరీరంలో సరైన రక్త ప్రసరణ జరుగక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు నిత్యం వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలి. సీజనల్ పండ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
వైద్యులను సంప్రదించాలి
పిల్లలు, వృద్ధులు అధికంగా నిమోనియా బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. అలాగే మంచుకురిసే సమయంలో బయటకు వెళ్లొద్దు. వ్యాధి బారిన పడకుండా పిల్లలకు టీకాలు వేయించాలి. వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శరీరంలో రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఎప్పటికప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలపై తక్షణం చికిత్స చేయించుకోవాలి. తద్వారా చలికాలంలో అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కినట్లేనని తెలిపారు.
ఎలా అధిగమించాలి
చలికాలంలో ఏళ్లనాటి ఒళ్లు నొప్పులు తిరిగి వస్తుంటాయి. అనేక మంది కీళ్ల నొప్పులతో సతమతం అవుతుంటారు. మోకాళ్ల నొప్పి తగ్గించుకునేందుకు ఎక్కువగా జిగురు పదార్థాలు తీసుకోవాలి. భుజం రాకుండా చేతులు అటు, ఇటుగా తిప్పాలి. వారం రోజులుగా జలుబు, పొడి దగ్గు సమస్యలతో బాధ పడుతూ జిల్లా ఆస్పత్రికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఓపీకి వస్తున్న వారిలో రోజుకు అధిక సంఖ్యలో ఈ రకమైన బాధితులు వస్తున్నట్లు తెలిసింది. చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు వినియోగించాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉంటూ కాస్త వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. వేడినిచ్చే ఆకుకూరలు, సజ్జలు, జొన్నలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. పిల్లల్లో దగ్గు, జ్వరం సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


