13న నవోదయ ప్రవేశ పరీక్ష
● 1,197 మంది విద్యార్థుల హాజరు
● పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: డీఈఓ
మెదక్ కలెక్టరేట్: సిద్దిపేట జిల్లాలో వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు ఎంపిక చేశామని తెలిపారు. ఈనెల 13వ తేదీ శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రా వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. సిద్ధార్థ మోడల్ హైస్కూల్, మెదక్ (ఏ, బీ సెంటర్లు) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గీత హై స్కూల్ (మెదక్), జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ హైస్కూల్ (నర్సాపూర్), మంజీరా విద్యా లయం (ఏ సెంటర్) రామాయంపేటలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


