ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర!
మెదక్‌జోన్: పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రచారం పరిసమాప్తం కావడంతో ఓటర్లను ప్రలోభాలకు తెరలేపారు. వారం రోజులపాటు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. జిల్లాలో మొదటి విడతలో అల్లాదుర్గ్, రేగోడు, టేక్మాల్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలోని 160 సర్పంచ్, 1,402 వార్డు సభ్యులకు ఎన్నికలు జరపాల్సి ఉండగా, ఇందులో 16 సర్పంచ్, 333 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవమైంది. 144 సర్పంచ్, 1,069 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలను ఎరవేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇక నామినేషన్ల ప్రారంభం నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు బాండ్ల రూపంలో సొంత మేనిస్టోలను విడుదల చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 92 గ్రామ పంచాయతీల్లో కేవలం 500 ఓట్లలోపు ఉన్న గ్రామాలున్నాయి. ఇక్కడ గంట వ్యవధిలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.


