అన్నా.. ప్లీజ్
ఒక్కసారి ప్రచారానికి రండి
‘అన్నా.. మా గ్రామానికి ఒక్కసారి వచ్చి నా తరఫున ప్రచారం చేయండి. నేనే సర్పంచ్‌గా గెలుస్తా’ అంటూ అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలను వేడుకుంటున్నారు. అయితే ఒకే పార్టీ బలపరిచిన ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్న చోట ఎవరికి ప్రచారం చేయాలి, ఎవరిని విస్మరించాలని నేతలు తలలు పట్టుకుంటున్నారు. గెలిచిన వ్యక్తే మనోడు అనే నిర్ణయానికి వచ్చారు. అనుకూలంగా ఉన్న చోట ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 492 గ్రామాలు ఉండగా, మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 144 గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇక రెండవ విడతలోని 8 మండలాల పరిధిలో 183 గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ శనివారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ, బరిలో నిలిచిన అభ్యర్థులు పార్టీల పరంగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సమయం ఎక్కువగా లేకపోవటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను మా గ్రామానికి ఒక్కసారి వచ్చి ప్రచారం చేయండి.. భారీ మెజార్టీతో గెలుస్తానంటూ వేడుకుంటున్నారు. అలా గే కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు ఇద్దరు ఎన్నికల బరిలో నిలవడంతో ఆ గ్రామానికి నేతలు వెళ్లడంలేదు. ఒకరి తరఫున ప్రచారం చేస్తే మరోవ్యక్తి దూరమవుతాడనే భా వనతో ఉన్నారు. గెలిచిన వ్యక్తే మనోడు అనే విధంగా పలు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు.
బుజ్జగింపులు.. బెదిరింపులు
ఒకేపార్టీ బలపరిచిన ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నామినేషన్లు వేసిన గ్రామాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగారు. ఒక్కరు మాత్రమే బరిలో ఉండాలని, అప్పుడే ఎదుటి వ్యక్తిపై విజయం సాధిస్తామని నచ్చచెబుతున్నారు. మరికొందరికి వచ్చే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొస్తే టికెట్ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. అయినా.. వినని వారిని బెదిరిస్తున్నారు. నా మాట వినకుంటే రాజకీయంగా ఏ అవకాశం రానివ్వకుండా చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు.


