పల్లెల్లో స్మార్ట్ ప్రచారం
రామాయంపేట(మెదక్): ఒకప్పటి ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నికలంటే వారం, పది రోజుల ముందు నుంచే మైక్ ద్వారా ప్రచారాలు, గోడలపై రాతలు కొనసాగేవి. అభ్యర్థుల తరఫున పోల్ చిటీలు ఇంటింటికి పంచేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. నేడు పల్లె పోరులో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా గ్రామాల వారీగా పదుల సంఖ్యలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభిస్తుండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓటర్లకు చేరువవుతున్నారు.
సెల్‌ఫోన్లే ప్రచార సాధనాలు
నేడు సెల్‌ఫోన్లే ప్రచార సాధనాలుగా మారాయి. మండల పరిధిలోని ఒక గ్రామంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా, సదరు పార్టీ నాయకుడు పోటీలో ఉన్న ఒక అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు అభ్యర్థి తమ నాయకుడితో ఫోన్ మాట్లాడిన విషయాలను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆయా పార్టీల సోషల్ మీడియా ఇన్‌చార్జిలు ఓటర్లకు సంబంధించి ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ పేరిట పాటలు రూపొందించుకొని గ్రామాల వారీగా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్రగతి ధర్మారంలో సర్పంచ్ అభ్యర్థి ఒకరు తనను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనుల విషయమై ఏకంగా బాండ్ రాయించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. పనిలో పనిగా అభ్యర్థులు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
సోషల్ ప్రచారంలో
సర్పంచ్ అభ్యర్థుల జోరు
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి
యత్నాలు
పల్లెల్లో స్మార్ట్ ప్రచారం


