18 బడులకు ఫైవ్‌స్టార్
పాఠశాలల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘స్వచ్ఛ ఏవమ్ హరిత’ పథకంలో భాగంగా రేటింగ్‌లో ప్రతిభ కనబర్చిన బడులకు ప్రోత్సాహకాలు అందించనుంది. పాఠశాలలను స్వచ్ఛత వైపు మళ్లించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొంటున్నారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు కలిపి 1,066 ఉన్నాయి. వాటిలో 1,058 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ‘స్వచ్ఛ ఏవమ్ హరిత’ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ లెక్కన 99.27 శాతం పాఠశాలలు పాల్గొనగా, వీటిలో 18 బడులు ఫైవ్‌స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి.
6 విభాగాలు.. 60 ప్రశ్నలు
స్వచ్ఛతకు సంబంధించిన 6 అంశాలను పరిగణలోకి తీసుకొని అందుకు సంబంధించి 60 ప్రశ్నలను ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నించారు. మరుగుదొడ్లు, తా గునీరు, చేతుల శుభ్రత, బడి ఆవరణ పరిశుభ్రత, ప్రవర్తన, మార్పు, మంచి అలవాట్లు, విద్యార్థుల నడవడిక.. తదితర ప్రశ్నలను ఆన్‌లైన్ ద్వారా పొందుపరిచారు. అలాగే 6 విభాగాలకు సంబంధించిన ఫొటోలను తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
రేటింగ్ ఎంపికలో 59 మంది
జిల్లావ్యాప్తంగా 1,058 పాఠశాలలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, వాటిని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 నుంచి 5 స్టార్ రేటింగ్‌గా గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా 59 మంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను నియమించారు. వాటిలో 18 (ఫైవ్‌స్టార్) 239 (ఫోర్ స్టార్) 625 త్రీస్టార్, 138 (టూస్టార్) 38 (వన్ స్టార్)గా విభజించారు. ఈనెల 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ప్రస్తుతం వచ్చిన స్టార్ రేటింగ్‌లు మారే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. కాగా జిల్లాలో ఫైవ్‌స్టార్ రేటింగ్ వచ్చిన పాఠశాలలను ప్రత్యేక బృందం నేరుగా పరిశీలించి, వాటిలో మెరుగైన 8 బడులను ఫైనల్ చేసింది. వాటిలోనూ 6 పాఠశాలలు రూరల్ (గ్రామీణ ప్రాంతం) 2 అర్బన్ (పట్టణ) ప్రాంత బడులను ఫైనల్ చేసి రాష్ట్ర స్థాయికి పంపనుంది. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి 20 పాఠశాలల చొప్పున ఎంపిక చేసి కేంద్రానికి పంపితే, వాటిలో అత్యుత్తమంగా ‘స్వచ్ఛ ఏవమ్ హరిత’కు జాతీయస్థాయిలో 200 బడులను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న ఒక్కో బడికి రూ. లక్ష చొప్పున గ్రాంటు విడుదల చేస్తారు. ఆ నిధులను పాఠశాల అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.
స్వచ్ఛత కార్యక్రమాలఆధారంగా రేటింగ్
ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొన్న1,058 బడులు
ఎంపికై న స్కూళ్లకు
రూ.లక్ష చొప్పున గ్రాంట్
ప్రతి పాఠశాల పోటీ పడాలి
స్వచ్ఛ ఏవమ్ హరితలో భాగంగా ప్రతి పాఠశాల ఫైవ్‌స్టార్ రేటింగ్ కోసం పోటీపడాల్సిన అవసరం ఉంది. జిల్లావ్యాప్తంగా 1,058 పాఠశాలలు దరఖాస్తు చేసుకోగా, వాటిలో కేవలం 18 బడులు మాత్రమే ఫైర్‌స్టార్ కై వసం చేసుకున్నాయి. ప్రతి పాఠశాల స్వచ్ఛతలో పోటీ పడినప్పుడే పర్యావరణం బాగుంటుంది.
– రాధాకిషన్, డీఈఓ


