సహకారం.. పారదర్శకం
రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణతో రైతులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సంఘాలు కొనసాగుతున్నాయి. గతంలో అన్ని పనులు కాగితాల ద్వారానే కొనసాగేవి. ఆ సమయంలో పొరపాట్లతో పాటు అవినీతి చోటు చేసుకునేది. ఎరువుల విక్రయాలు, పంట రుణాలు, ధాన్యం కొనుగోళ్లు, సబ్సిడీల వంటి ఎన్నో లావాదేవీలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలో 37 ప్రాథమిక సహకార సంఘాలుండగా, అన్నింటిని గతంలోనే ఆన్‌లైన్ చేశారు. సంఘాల పరిధిలో గతంలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రుణాల మంజూరులో రైతులకు అన్యాయం జరిగేది. ఎరువుల అమ్మకాలకు సంబంధించి అన్‌లైన్ విధానం లేకపోవడంతో ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అన్ని సొసైటీలను ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకనుగుణంగా జిల్లా పరిధిలో అన్ని సొసైటీలు డిజిటల్‌గా రూపుదిద్దుకున్నాయి.
మరిన్ని సేవలకు ‘సీఎస్‌సీలు’
రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా కామన్ సర్వీసెస్ సెంటర్లు (సీఎస్‌సీ) ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు అన్ని సంఘాలకు లైసెన్సులు జారీ చేసినా, ఆయా సొసైటీలు శ్రద్ధ చూడడం లేదు. మీసేవ తరహాలో సీఎస్‌సీలు ఏర్పాటైతే రైతులకు కేంద్రానికి సంబంధించి 32, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 80కిపైగా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇన్ని ఉపయోగాలున్నా, వీటి ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. ఇవి ఏర్పాటైతే ప్రభుత్వ సేవలతో పాటు ఆర్థిక లావాదేవీలు, వ్యవసాయ సమాచారం, పారదర్శకంగా రైతులకు అందే అవకాశం ఉంటుంది. రుణాలకు సంబంధించి దరఖా స్తులు, పథకాల వివరాలు, వ్యవసాయ సమాచారం, పంటల బీమా వంటి ఎన్నో పథకాల గురించి రైతులకు అవగాహన కలుగుతుంది. ఇదిలా ఉండగా సహకార సంఘాల తరఫున జిల్లాలో కొత్తపల్లి, కోనాపూర్, ఇబ్రాహీంపూర్, టేక్మాల్‌లో గతంలో మూడు పెట్రోలు బంకులను నెలకొల్పారు. ప్రస్తుతానికి కొత్తపల్లిలో మాత్రమే పెట్రోల్ బంక్ కొనసాగుతోంది. కోనాపూర్‌లో ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇచ్చారు. ఇబ్రాహీంపూర్, టేక్మాల్‌లో మూతపడ్డాయి.
రైతులకు ప్రయోజనాలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాలను ఆన్‌లైన్ చే యించాం. దీంతో రైతులకు పారదర్శకమైన సేవలు లభిస్తున్నాయి. రైతులకు మరిన్ని సేవలందించడానికి వీలుగా కామన్ సర్వీసెస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
– కరుణాకర్, జిల్లా సహకార అధికారి
ప్రాథమిక సహకార సంఘాలడిజిటలీకరణ
రైతులకు అందుతున్న ఆన్‌లైన్ సేవలు
జిల్లావ్యాప్తంగా 37 పీఏసీఎస్‌లు


