అతివలకు భరోసా
హవేళిఘణాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఫోన్ నంబర్ షేర్ చేసుకున్నాడు. వాట్సాప్, వీడియో కాల్స్ ప్రారంభించి, అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు షీటీంను ఆశ్రయించగా, ఈ–పీటీ కేసు నమోదు చేశారు.
పాపన్నపేట మండలంలో వరి కోతలు కోసేందుకు హార్వెస్టర్‌తో వచ్చిన వ్యక్తి స్థానికంగా ఉండే ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. దీంతో బాధితురాలు షీటీంను ఆశ్రయించగా, అతడిని పట్టుకొని ఈ–పీటీ కేసు నమోదు చేశారు.
మెదక్‌మున్సిపాలిటీ: మహిళల భద్రత కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన షీటీంలు అకతాయిల అగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయి. జిల్లాలో 2015లో మెదక్, తూప్రాన్ డివిజన్ల పరిధిలో రెండు షీటీం బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, నిఘాను పెంచడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. ఈఏడాది ఇప్పటివరకు 500పైగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 760 ఫిర్యాదులు రాగా.. అన్నింటిని పరిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, సంక్షేమ హాస్టళ్లు, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించడం, అఘాయిత్యాలు చోటు చేసుకోకుండా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా మెదక్ డివిజన్ పరిధిలో 58, తూప్రాన్ డివిజన్ పరిధిలో 57, తరచూ నేరాలు జరిగే ప్రాంతాలు (హాట్‌స్పాట్)గా గుర్తించి పోలీస్‌శాఖ షీటీం సభ్యులను ఆ ప్రాంతాల్లో మఫ్టిలో ఉంచుతున్నారు. అలాగే నింతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో షీటీంల ద్వారా మహిళల భద్రతకు సంబంధించి ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. బృందం సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. మహిళలపై దా డులను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ
జిల్లాలో చురుగ్గా షీటీం సేవలు
రద్దీ ప్రాంతాల్లో పెరిగిన నిఘా
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట
35 పోక్సో కేసులు
జిల్లాలో ఈ ఏడాది మొత్తం 760 ఫిర్యాదులు రాగా, 35 పోక్సో కేసులు, 60 ఈ–పీటీ కేసులు నమోదు అయ్యాయి. మెదక్‌లో ముఖ్యంగా ఖిల్లా, పోచారం డ్యాం, రద్దీగా ఉండే ప్రాంతాలు, తూప్రాన్ పరిధిలో పలు బస్టాండ్లలో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటూ వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.


