
ఏ స్థానం ఎవరికో?
నేడు కమిషనరేట్‌కు
జాబితాలు?
స్థానిక రిజర్వేషన్లు కొలిక్కి..
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలనే అంశంపై సంబంధిత అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తోంది. ఆయా స్థానాల రిజర్వేషన్ల జాబితాలను రూపొందించి పంపాలని ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు మండల స్థాయిలో ఎంపీఓలు, ఎంపీడీఓలు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, డీపీఓ, సంబంధిత అధికారులు సోమవారం విస్తృతంగా కసరత్తు చేశా రు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆయా స్థానాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న నాయకులు తమకు ఈ రిజర్వేషన్లు అనుకూలిస్తాయా? లేదో? నని ఆందోళనలో ఉన్నారు.
కులగణన ఆధారంగా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేటాయిస్తున్నారు. ఈ డేటా అంతా ప్రభుత్వమే జిల్లాకు పంపింది. మహిళా రిజర్వేషన్ల ఖరారుకు లాటరీ పద్ధతిని వాడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఆయా స్థాయిల్లో అధికారాలు
రిజర్వేషన్ల ఖరారు చేసే అధికారాన్ని ఆయా స్థానా న్ని బట్టి సంబంధిత అధికారులకు అప్పగించారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించే అధికారం ఎంపీడీఓలకు ఇవ్వగా, సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు అదనపు కలెక్టర్ ప్రకటించే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
పదవులపై ఆశతో జేబులు గుల్ల
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు విందులు.. చందాలు, పలకరింపులు.. చేయూతలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లోని రెండు గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఇటీవల వినోద యాత్రలకు తరలివెళ్లినట్లు తెలిసింది. పాపన్నపేట, కొత్తపల్లి గ్రామాల్లో పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఏడాది కాలంగా డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుచరులకు మందు, విందులతో ఖుషీ చేస్తున్నారు. ఆటల పోటీలకు బహుమానాలు, అన్నదానాలు, చందాలు ఇస్తూ, పంచాయతీలను తెంపుతూ, ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చిన్నశంకరంపేట, ఖాజాపూర్, చందంపేట, కామారం, మిర్జాపల్లి, రామాయంపేట మండలం కాట్రియాల్, ప్రగతి ధర్మారం, లక్ష్మాపూర్, జాన్సిలింగాపూర్, హవేళిఘణాపూర్, కూచన్‌పల్లి, సర్ధెన గ్రామాల్లో సైతం పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు ఓటర్లకు ఆర్థిక, వినిమయ, ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇంత చేసినా రిజర్వేషన్లు అనుకూలిస్తాయా..? లేదా అనే అనుమానాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆయా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి.. సంబంధిత జాబితాలను నేడు (మంగళవారం) పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్‌కు పంపనున్నట్లు తెలిసింది. ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
కసరత్తు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
నేడు కమిషనరేట్‌కు స్థానాల వారీగా జాబితా
ఆశావహుల్లో ఉత్కంఠ