
సిద్దిపేట అంటే ఎంతో ఇష్టం
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేట అంటే ఎంతో ఇష్టం. ఎక్కడా లేని విధంగా పచ్చని చెట్లు, పరిసరాల పరిశుభ్రత, పర్యాటకంగా ఎంతో అద్భుతంగా ఉంది’ అని ఇంటర్నేషనల్ మైమ్ కళాకారుడు మ ధు అన్నారు. పట్టణంలో ప్రియదర్శినీ నగర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో మైమ్ మధు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే...
వేలాడే వంతెన అద్భుతం
సిద్దిపేటలోని కోమటి చెరువు సూపర్.. వాటర్ షో అదుర్స్. చెరువుపై నిర్మించి వేలాడే వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ షో చేసేందుకు వచ్చాను. తర్వాత సిద్దిపేట, మెదక్ జిల్లాలోని మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై మైమ్ షో ద్వారా అవగాహన కల్పించాను.
డాక్టర్ కావాలనుకున్నా..
విద్యార్థి దశలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులందరం కలిసి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేవాళ్లం. నేను ముకాభినయం ప్రదర్శించాను. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో డాక్టర్ కావాలన్న లక్ష్యం కాస్త మైమ్ కళాకారుడిగా స్థిరపడేలా చేసింది.
2 వేలకు పైగా షోలు
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జపాన్, దుబాయ్, ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పటివరకు 2 వేలకు పైగా మైమ్ షోలు చేశాను. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మైమ్ షోను సైతం నిర్వహించాను. ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి వందలాది మంది నటులకు మైమ్‌లో శిక్షణ ఇచ్చాను.
కోమటి చెరువు సూపర్
వాటర్ షో అదుర్స్
మైమ్‌పై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తా
‘సాక్షి’తో ఇంటర్నేషనల్ మైమ్ కళాకారుడు మధు