
15 వరకు రేషన్ పంపిణీ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాల్లోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసినట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 18,808 రేషన్ కార్డులు పెరిగాయని, అలాగే 80,130 మంది నూతనంగా కార్డుల్లో చేరారని వివరించారు. మెదక్ నియోజకవర్గంలో అత్యధికంగా 7,123 కొత్త కార్డులతో పాటు 29,087 మందిని కార్డుల్లో చేరారన్నారు. నర్సాపూర్‌లో 5,385 కార్డులతో పాటు నూతనంగా 24,709 మందిని చేర్చినట్లు చెప్పారు. జిల్లాలోని కొన్ని మండలాలు ఆందోల్, ఖేడ్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లోకి వెళ్లాయని, వాటిలో 6,300 కొత్త రేషన్‌కార్డులతో పాటు 26,334 మందిని నూతనంగా చేర్చినట్లు తెలిపారు. పాత కార్డులు 2,13,771 ఉండగా, కొత్తగా 18,808 కార్డులు రావడంతో మొత్తం 2,32,579 చేరిందన్నారు. అయితే హవేళిఘణాపూర్ మండలంలోని మూ డు గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో వాటికి బియ్యం సరఫరా కాలేదని, త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 15 వరకు జిల్లాలో రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తుందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సివిల్ సప్లై డీఎం జగదీశ్
జిల్లాలో కొత్త కార్డులు 18,808