
లాభాలు పంచడం అభినందనీయం
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్
పాపన్నపేట(మెదక్): రైతులకు లాభాలు పంచి కొత్తపల్లి రైతు సహకార సంఘం ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవెందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్‌తో కలసి కొత్తపల్లి సొసైటీని పరిశీలించారు. సొసైటీ రైతులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023–24, 25 సంవత్సరాలకు సంబంధించి సొసైటీకి వచ్చిన లాభాల్లో 10 శాతం రైతులకు పంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర సొసైటీలు కూడా ఈ మార్గం అనుసరించాలని కోరారు. సొసైటీ పరిధిలో డీజిల్, పెట్రోల్ బంకు, ఫర్టిలైజర్ షాపు, గోదాం, రైస్‌మిల్లు, వాటర్ ప్లాంటు తదితర సేవలతో రైతులకు అకనే రకాలుగా ఉపయోగ పడుతుందన్నారు. సొసైటీ పరిధిలో గానుగ ఏర్పాటు చేస్తే, మంచి నూనె అందించవచ్చన్నారు. డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పంటరుణం కాకుండా, ఎల్‌టీ లోన్లు మంజూరు చేస్తే బాగుంటుందని సూచించారు. చైర్మన్ రమేష్ మాట్లాడుతూ..పెట్రోల్ బంకులో సీఎన్‌జీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఇఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.