
పారిశుద్ధ్య లోపం
పల్లెలకు వైరల్ ఫీవర్ పట్టుకుంది. మూడు రోజులకు పైగా వానలు ‘ముసురు’కోవడంతో జ్వరాలతో పల్లెవాసులు దవాఖానాలకు పరుగులు పెడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సహజంగా వానాకాలంలో దోమల బెడద, తాగునీటి కలుషితం అధికంగానే ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి మూడింతలు జ్వర పీడితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏ పల్లెలో చూసినా మంచం పట్టిన వారే అధికం.
– మెదక్‌జోన్
జిల్లా వ్యాప్తంగా 21 మండలాలు.. 492 గ్రామాలు.. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 7.24 లక్షల పైచిలుకు మంది జనాభా ఉన్నారు. 19 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఒకటి జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఒకటి మాతాశిశు ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2 చొప్పున ఉన్నాయి. వానాకాలం ప్రారంభం జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 8,251 జ్వరాలు, 3 డెంగీ, 21కి పైగా టైఫాయిడ్ జ్వరాలు నమోదయ్యాయి. గతేడాది జులై నెలాఖరు వరకు కేవలం 2,871 జ్వరాలు మాత్రమే నమోదు అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది 5,380 మంది అధికంగా జ్వరం పీడితులు ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘పల్లె పాలన’ లేకపోవటమే. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 18 నెలలు కావొస్తుండటంతో పంచాయతీల నిర్వహణ భారం పంచాయితీ సెక్రటరీలపై పడింది.
ముందస్తు చర్యలు
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 560 మంది ఆశవర్కర్లు ఉండగా వారితో నిత్యం వ్యాధుల సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో ఆశవర్కర్ ప్రతిరోజు 20 ఇళ్ల చొప్పున తిరిగి వ్యాధుల బారిన పడిన వారి వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ఏఎన్‌ఎంకు అందించనున్నారు. ఒక వేళ ఏ ఇంట్లో నైనా సాధారణ జ్వరం ఉంటే అక్కడే మందుగోళీలు ఇస్తున్నారు. లేక టైఫాయిడ్, డెంగీ, మలేరియా లాంటి లక్షణాలు ఉంటే మండల మెడికల్ అధికారి దృష్టికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. జ్వరాలను ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
513 క్యాంపుల ఏర్పాటు
ఈసారి జ్వరాల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్య సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 513 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అలాగే వ్యాధులకు కారణం అయ్యే స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మంచం పట్టిన పల్లెలు
ముసురుకున్న సీజనల్ వ్యాధులు
జిల్లాలో 8వేల పైచిలుకు జ్వర పీడితులు
3 డెంగీ, 20కిపైగా టైఫాయిడ్ కేసులు
పరిశుభ్రత తప్పనిసరి
సీజన్‌వ్యాధుల నివారణకు వ్యక్తిగతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించాలి. కొబ్బరి చిప్పలు, పాతటైర్లలో నీరు నిలువ ఉండరాదు. నీటిగుంటలను పూడ్చివేయాలి, పెద్ద గుంతలు ఉంటే వాటిలో దోమల లార్వా పెరగకుండా ఆయిల్‌బాల్స్ వేసి దోమల నివారణ చేపట్టాలి.
– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ మెదక్
జిల్లాలో సీజనల్ వ్యాధుల విజృంభనకు ప్రధాన కారణం గ్రామాల్లో పారిశుద్ధ్య లోపించడమే కారణమని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులు లేక పోవటంతో పంచాయతీ కార్యదర్శులే సొంతంగా డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్య నిర్వాహణ చేపడుతున్నారు. నిత్యం సేకరించాల్సిన చెత్తను కొన్ని గ్రామాల్లో రెండు, మూడు రోజులకోసారి తొలగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో వారంరోజులకోసారి తీస్తుండటంతో ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు అధికమవుతున్నాయి.

పారిశుద్ధ్య లోపం