
స్వచ్ఛతకు నిధులు
కేటాయింపు ఇలా..
మున్సిపాలిటీ నిధులు (రూ.లలో)
అమీన్‌పూర్ 7,17,141
అందోల్–జోగిపేట 4,26,848
బొల్లారం 42,76,373
చేర్యాల 3,65,174
దుబ్బాక 5,49,240
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 66,26,784
హుస్నాబాద్ 4,33,385
మెదక్ 8,12,730
నర్సాపూర్ 3,79,634
రామాయంపేట 3,59,549
సదాశివపేట 6,96,026
సంగారెడ్డి 22,29,523
సిద్దిపేట 1,19,70,573
తెల్లాపూర్ 45,56,296
తూప్రాన్ 24,13,867
జహీరాబాద్ 12,05,599
నారాయణఖేడ్ 3,65,934
పట్టణాల్లో స్వచ్ఛత వెల్లివిరియనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిధులను కేటాయించారు. పలు మున్సిపాలిటీలు నిధులు లేక నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలకు రూ.3.83కోట్లు మంజూరు చేసింది. – సాక్షి, సిద్దిపేట
పట్టణాలకు ప్రతీ ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకులను కేటాయిస్తుంది. వివిధ కేటగిరిలలో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ అవార్డులను ప్రకటిస్తుంది. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకు అత్యధికంగా అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2021లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 అక్టోబర్ వరకు కొనసాగ నుంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పట్టణాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.3,83,84,676 నిధులు మంజూరు చేశారు. ఆయా పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీకి, అత్యల్పంగా రామాయంపేట మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయి.
వీటి నిర్వహణకు..
మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఘన వ్యర్థాల నిర్వహణ, సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు, విజ్ఞానం, కమ్యూనికేషన్, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా వెచ్చించనున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, బయో మైనింగ్ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని ఆదేశించారు.
సౌకర్యాలు ఇక మెరుగు
మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల ద్వారా దాదాపు అన్ని కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే ఆదాయం తక్కువగా వస్తుండటంతో కార్యాలయ భవనాల, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు మంజూరైన తరుణంలో మున్సిపాలిటీలలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
‘స్వచ్ఛత’లో మెరుగైన ర్యాంక్ సాధిస్తాం
స్వచ్ఛభారత్ నిధులను మున్సిపల్ పరిధిలో నిర్వహించే స్వచ్ఛత కార్యక్రమాలకు వినియోగిస్తాం. డీఆర్‌సీ సెంటర్, డంపింగ్ యార్డు అభివృద్ధి, టాయిలెట్స్ నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అందరి సమష్టి కృషితో స్వచ్ఛభారత్ మిషన్‌లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. సీడీఎంఏ అనుమతితో నిధులు వినియోగిస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్

స్వచ్ఛతకు నిధులు