
మున్సిపాలిటీల్లో వార్డు కార్యాలయాలు
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, పరిపాలనను ప్రజలకు మరింతగా చేరువ చేయడానికిగాను మున్సిపాలిటీల పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటైతే ఆయా వార్డుల పరిధిలో ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి. వార్డు పరిధిలోనే ప్రజలకు అన్ని రకాల సేవలు అందే అవకాశం ఉంటుంది. ఈమేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది
వార్డు కార్యాలయాల ఏర్పాటు నిర్ణయం మంచిది. కార్యాలయాలు ఏర్పాటైతే అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. చాలా వరకు సమస్యలు వార్డు కార్యాలయాల్లోనే పరిష్కారమవుతాయి.
–దేవేందర్, మున్సిపల్ చైర్మన్, రామాయంపేట
● తొలుత నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటుకు కసరత్తు
● జిల్లాలో మొత్తం 75 వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం
● తీరనున్న ప్రజల ఇబ్బందులు
● పరిపాలన మరింతగా ప్రజలకు చేరువయ్యే అవకాశం
రామాయంపేట(మెదక్): జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 75 వార్డులున్నాయి. ఇప్పటికే వార్డుకు ఒక అధికారి చొప్పున కొనసాగుతున్నారు. వీరు మున్సిపల్ కార్యాలయంనుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వార్డు అధికారులు వార్డుల్లోకి సక్రమంగా రావడంలేదని, వారు కార్యాలయానికే పరిమితమయ్యారనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఆయా వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సదరు అధికారి వార్డు పరిధిలోనే విధులు నిర్వహిచాల్సి ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు ప్రజలకు అన్ని రకాల సేవలందే అవకాశం ఉంటుంది.
పాలన మరింతగా చేరువ
వార్డు కార్యాలయాలు ఏర్పాటైతే ప్రజలకు పాలనా సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. చాలావరకు సమస్యలు సకాలంలో పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. ఆయా వార్డులకు చెందిన ప్రజలు పనుల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదు. కాగా, వార్డుల్లో కార్యాలయాల ఏర్పాటు అంత సులభం కాదనే అభిప్రాయం నెలకొంది. కొత్తగా కార్యాలయం, ఫర్నీచర్, కంప్యూటర్ల ఏర్పాటు, తదితర అంశాలు ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు.
వార్డు కార్యాలయాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు
● మున్సిపాలిటీల పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటైతే ప్రజలకు పౌరసేవలు అందుబాటులో ఉంటాయి.
● జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా పత్రాలు పొందడం సులభతరమవుతుంది.
● ఇంటిపన్ను, నీటి బిల్లులు వార్డు కార్యాలయాల్లోనే చెల్లించే అవకాశం ఉంటుంది.
● తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి వార్డు కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుంది.
● వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వంటి ఇతర సమస్యలు వార్డు కార్యాలయాల ద్వారానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
● కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను వార్డు స్థాయిలో ప్రజలకు వివరించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేసే అవకాశం కలుగుతుంది.
● వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలందుబాటులోకి వస్తాయి.
● ప్రభుత్వ నిర్ణయాలు, కొత్త పథకాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని వార్డు కార్యాలయాలద్వారా ప్రజలకు త్వరితగతిన చేరవేసే అవకాశం ఉంటుంది.

మున్సిపాలిటీల్లో వార్డు కార్యాలయాలు