
పాపన్నపేటలో చిరుత కలకలం!
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వెంకటేశ్వర గుట్ట పరిసర ప్రాంతంలో చిరుతను పోలిన పాదముద్రలు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఇదే గుట్టకు ఆవతలి వైపున దౌలాపూర్ శివారులో సైతం చిరుత కనిపించింది. అయితే శుక్రవారం కనిపించిన రెండు పాదముద్రలను బట్టి, ఒకటి తల్లి, మరొకటి పిల్ల చిరుతగా స్థానికులు భావిస్తున్నారు. దీంతో అటువైపు పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ఈ విషయమై డీఎఫ్‌ఓ జోజిని వివరణ కోరగా తమ సిబ్బందిని పంపుతామని తెలిపారు. అయితే సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ పరిశీలించి పాదముద్రలు చిరుతలా కనిపించడం లేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.