
భూ భారతి ఎన్నో ఆశలు
‘చిలప్‌చెడ్’లో ముగిసిన రెవెన్యూ సదస్సులు
● మొత్తం 953 దరఖాస్తుల స్వీకరణ
● భూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి ఆర్‌ఓఆర్ చట్టంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో ఇటీవల రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 953 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. – మెదక్‌జోన్
జిల్లాలో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చిలప్‌చెడ్ మండలాన్ని ఎంపిక చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు రెండు బృందాలుగా ఏర్పడి 10 రోజుల పాటు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 953 దరఖాస్తులు రాగా, ప్రధానంగా 301 సర్వే నంబర్లు మిస్ అయ్యాయని, సాదా బైనామాల కోసం 229, భూ విస్తీర్ణం సరిచేసేందుకు 148, పేరు మార్పిడి 122, కోర్టులో ఉన్న భూ సమస్యలపై 153 దరఖాస్తులు వచ్చాయి. అలాగే మండలంలోని గౌతంపూర్ శివారులో గల గన్యాతాండాలో 204 సర్వే నంబర్‌లో 148 ఎకరాల భూమిని 106 మంది రైతులు చాలా కాలంగా సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ భూమికి పట్టా లు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. పట్టా చేయాలని చాలా కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొత్త ఆర్‌ఓఆర్ చట్టంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇలాంటి సమస్యలు జిల్లాలో వేలాదిగా ఉన్నాయి.
జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో అమలు
రాష్ట్ర అవరతణ దినోత్సవం జూన్ 2 నుంచి భూ భారతి చట్టం అమలు కానున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు సంబంధిత ధ్రువపత్రాలను జోడించి దరఖాస్తు ఫాంతో కలిపి అధికారులకు అందించాలని సూచించారు. ఇందుకోసం రెవెన్యూ సిబ్బందిని టీంలుగా విడదీసి సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిసింది. ఈక్రమంలో పైలెట్ ప్రాజెక్టు చిలప్‌చెడ్ మండలంలో స్వీకరించిన దరఖాస్తులను సైతం పరిశీలించనున్నారు. వాటిలో తక్షణం పరిష్కరించాల్సిన వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో చిన్నపాటి సమస్యలు ఉన్న భూములను సైతం పార్ట్–బీలో పెట్టి చేతులు దులుపుకుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాలు పార్ట్‌బీలో ఉన్నట్లు సమాచారం. నూతన భూ భారతి చట్టంలో వాటిని పరిష్కరించే ఆస్కారం ఉంది.
సర్వేయర్ల భర్తీ.. ప్రత్యేక శిక్షణ
భూ భారతి చట్టం ద్వారా అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు సర్వేయర్లు అవసరం ఉంటుందని భావించింది. ఇందుకోసం ఈనెల 5వ తేదీ నుంచి 17 వరకు లైసెన్స్ కలిగి ఉన్న సర్వేయర్లు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలని, వారికి 50 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్వేయర్‌గా చేర్చుకుంటామని స్పష్టం చేసింది.
నేడు మంత్రులపర్యటన
జిల్లాలో భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ హాజరవుతారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు.