
మొదటి రోజే పుస్తకాలు
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల్లోనే ఆయా జిల్లాలకు పుస్తకాలు పంపిస్తోంది. జిల్లాకు ఇప్పటికే పార్ట్–(1)లో భాగంగా 84 శాతం చేరుకోగా, త్వరలోనే పూర్తిస్థాయిలో పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చిన వాటిని ఆయా మండలాల ఎమ్మార్సీలకు తరలించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 955 ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 84,387 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, బడులు తెరిచే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా పుస్తకాలను పార్ట్– 1, పార్ట్– 2 విభజించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మొదటి పార్ట్‌లో సగం చాప్టర్లు, రెండో పార్ట్‌లో మిగితా చాప్టర్లను ముద్రించి ఇస్తున్నారు. జిల్లాకు 4,60,450 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 3,85,248 వచ్చాయి. ఈ లెక్కన ఇంకా 75,202 రావాల్సి ఉంది. మిగితా వాటిని పాఠశాలలు తెరిచే సమయానికి అందించనున్నారు. అలాగే పార్ట్– 2 పుస్తకాలు మాత్రం సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చిన పుస్తకాలకు ఆయా మండలాల ఎంఆర్‌సీలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు పేద వారు కావటంతో వారికి సకాలంలో పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు స్కూల్ యూనిఫాంలు అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చాలా వరకు మరమ్మతులు పూర్తి చేశారు.
కొత్త బుక్స్‌తో విద్యార్థులు తరగతులకు వెళ్లేలా చర్యలు
జిల్లాకు చేరుతున్న పాఠ్య పుస్తకాలు
ఇప్పటివరకు 84 శాతం చేరిక
త్వరలోనే పూర్తి స్థాయిలో..
ఎమ్మార్సీలకు పంపిస్తున్నాం
జిల్లాకు ఇప్పటివరకు 84 శాతం పాఠ్యపుస్తకాలు రాగా, వాటిని ఆయా మండలాల్లోని ఎంఆర్‌సీలకు పంపిస్తున్నాం. పాఠశాలలు తెరి చే సమయానికి విద్యార్థులకు బుక్స్ అందిస్తాం. అలాగే ముందస్తు బడిబాట కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో విద్యార్థుల సంఖ్యను పెంచే విషయమై సమీక్ష కొనసాగిస్తున్నాం.
– రాధాకిషన్, డీఈఓ
రండి.. ప్రభుత్వ బడుల్లో చేరండి
ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులను కలిసి సర్కారు బడులపై అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తు బడిబాట మే మొదటి వారం నుంచే ప్రారంభం కాగా, అధికారికంగా జూన్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. గతేడాది కలెక్టర్ రాహుల్‌రాజ్ బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. దీంతో ఎప్పు డూ లేని విధంగా విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది.

మొదటి రోజే పుస్తకాలు