
రోడ్డెక్కిన రైతన్న
కొనుగోళ్లలో ఆలస్యంపై ఆగ్రహం
ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి ఆందోళన
చిలప్‌చెడ్(నర్సాపూర్)/శివ్వంపేట: ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు భగ్గుమన్నారు. సోమవారం మండలంలోని చిట్కుల్‌లో మెదక్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోగా.. సుమారు గంట వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. తూకం జరిగి రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ధాన్యం అలాగే ఉంటుందని వాపోయారు. అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయని, మరోవైపు టార్పాలిన్ల అద్దె పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏపీఎం ప్రేమలతతో ఫోన్‌లో మాట్లాడించారు. లారీల కొరత తీరుస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 24 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.అలాగే శివ్వంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యం తరలించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తూప్రాన్– నర్సాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరుగు పేరిట అదనంగా తూకం వేస్తున్నా రని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధాన్యం తరలింపునకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

రోడ్డెక్కిన రైతన్న