బెనిఫిట్స్‌ అందక బేజారు | - | Sakshi
Sakshi News home page

బెనిఫిట్స్‌ అందక బేజారు

May 14 2025 8:05 AM | Updated on May 14 2025 8:05 AM

బెనిఫ

బెనిఫిట్స్‌ అందక బేజారు

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కొలుపుల పద్మ. మెదక్‌ మండలం మక్తభూపతీపూర్‌ గ్రామం. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు ఆమెది. పద్మ లేబర్‌ కార్మికురాలిగా రిజిస్టేషన్‌ చేయించుకున్నారు. ఆమె కూతురు పెళ్లి జరిగి.. ఇద్దరు పిల్లలు పుట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసవం కోసం అందాల్సిన రూ.30 వేలు అందటం లేదు. నిత్యం కార్మికశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇలా పద్మలాంటి మరో పది మంది బాధితులు మంగళవారం లేబర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

మెదక్‌జోన్‌: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో ఎక్కువ శాతం మంది వర్షాకాలంలో వ్యవసాయ కూలీలుగా, తర్వాత భవన నిర్మాణ కార్మికులుగా, లేదా అడ్డామీద కూలీలుగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ కార్మికులకు కేంద్రం నుంచి అనేక రాయితీలు, ప్రయోజనాలు కల్గించే పథకాలు ఉన్నాయి. కానీ.. అవగాహన లోపంతో పలురకాల ప్రయోజనాలను వీరు పొందలేక పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్‌ కార్డు కలిగిన అర్హులకు అందాల్సిన బెన్‌ఫిట్స్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందని ద్రాక్షగా మిగిలింది.

కార్మికుల బెన్‌ఫిట్స్‌ ఇలా..

● భవన నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికుల జీవితం ఎప్పుడు ప్రమాదం అంచునే ఉంటుంది. ఇలాంటి వారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో కార్మికులకు ఈ విధంగా లబ్ధి చేకూరనుంది.

● కార్మికుడిగా పనులు చేస్తూ ఆ శాఖలో రూ.110 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ఆ కార్మికుడు, లేదా కార్మికురాలు సాధారణ మరణం చెందితే రూ.1.30 లక్షలు, అదే ప్రమాదావశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.

● కార్మిక కుటుంబాల్లోని యువతులకు పెళ్లిళ్లు, లేదా ప్రసవాలు జరిగినా రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తారు.

రెండేళ్లుగా ఇన్‌చార్జిలే..

మెదక్‌ జిల్లాలో లేబర్‌ ఆఫీసు ఉన్నప్పటికీ రెండేళ్లుగా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. వారు నెలకోసారి కూడా ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నెట్టుకొస్తున్నాడు. నిబంధనల ప్రకారం కార్మికులకు అందాల్సిన బెన్‌ఫిట్స్‌ ఏళ్ల తరబడి అందటంలేదు. కార్మికుల కూతుళ్లకు ప్రసవం డబ్బులు రాక కొందరు. భర్త చనిపోయిన వారికి రావాల్సిన లబ్ధికోసం మరికొందరు, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులు.. ఇలా పది మంది బాధితులు మంగళవారం లేబర్‌ కార్యాలయానికి వచ్చారు. ఏళ్ల తరబడి తమను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, బెన్‌ఫిట్స్‌ కోసం డాక్యుమెంట్స్‌ను అందించినా ఏదో కుంటుసాకుతో కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యం మాట వాస్తవమే

సాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులపాటు ఆలస్యమైన వాస్తవమే. దీంతో కొంత మందికి అందించాల్సిన బెన్‌ఫిట్స్‌ అందించడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం తాను వికారాబాద్‌కు బదిలీ అయ్యాను. మెదక్‌ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం.

– యాదయ్య, ఇన్‌చార్జి లేబర్‌ అధికారి

ఏళ్ల తరబడి లేబర్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

రెండేళ్లుగా ఇన్‌చార్జి అధికారులే దిక్కు

ఆందోళన చెందుతున్న బాధితులు

బెనిఫిట్స్‌ అందక బేజారు1
1/1

బెనిఫిట్స్‌ అందక బేజారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement