
జీరో.. డౌన్!
ఎండలు మండుతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకంపై పడింది. ఫలితంగా చాలా మంది లబ్ధిదారులు పథకానికి అనర్హులుగా తేలారు. – మెదక్‌జోన్
‘గృహజ్యోతి’
అర్హుల సంఖ్య 1,31,950
పెరిగిన అనర్హుల సంఖ్య ఇలా..
ఫిబ్రవరి 1,418
మార్చి 1,457
ఏప్రిల్ 3,807
మే 4,557
జిల్లావ్యాప్తంగా 7 లక్షల పైచిలుకు జనాభా ఉండగా, 1,31,950 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందుతున్నారు. ఎండల తీవ్రతతో ఫిబ్రవరి నుంచి క్రమంగా పథకానికి లబ్ధిదారులు దూరం అవుతూ వస్తున్నారు. జిల్లాలో 1,31,950 మంది గృహజ్యోతి పథకానికి అర్హులు కాగా, ఫిబ్రవరిలో 1,418 మంది మార్చిలో 1,457, ఏప్రిల్‌లో 3,807, ఈ నెలలో 4,557 మంది అనర్హులుగా తేలారు.
వేసవి ఎండల ప్రభావంతో..
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలలో మెదక్ 4వ స్థానంలో ఉంది. కాగా ఫిబ్రవరిలో 35 డిగ్రీలు నమోదు కాగా, మార్చిలో 40 డిగ్రీలకు పెరిగింది. ఏప్రిల్, మేలో 42 నుంచి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాకుండా ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎండల తీవ్రతకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, టీవీ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరగటంతో ఈనెలలో 4,557 మంది గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల విద్యుత్ కన్నా ఎక్కువగా వాడటంతో అనర్హులుగా మారారు. కాగా విద్యుత్ యూనిట్ల వినియోగం పెరిగినా కొద్ది ధరలో మార్పు వస్తోంది. ఇందులో భాగంగా 1 నుంచి 50 యూనిట్ల విద్యుత్ వాడితే రూ. 1.95 పైసలు, 50 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ. 3.10, అలాగే 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ. 4.80 యూనిట్ ధర ఉండగా, 200 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్‌కు ఏకంగా రూ. 5.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ లెక్కన 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వాడిన గృహాజ్యోతి లబ్ధిదారులు ఈ పథకానికి దూరం అవటంతో పాటు నెలకు రూ. వెయ్యి కంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు.
200 యూనిట్లు దాటితే వర్తించదు
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తోంది. అంతకు మించి వాడితే వర్తించదు. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వాడకం పెరిగి ఈ పథకానికి నెలనెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది.
– శంకర్,
ట్రాన్స్‌కో ఎస్‌ఈ, మెదక్
ఎండ సురసుర.. మీటర్ గిరగిర
తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం