మెదక్ కలెక్టరేట్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సచివా లయం నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమావేశమై తగు సూచనలు సలహాలు చేశారు. ఇరిగేషన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి వృథా లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటి పొదుపు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఏఓ వినయ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.