ఇంటికో సైనికుడు.. ఆర్మీ అంటే వీరికి ప్రాణం | Sakshi
Sakshi News home page

ఇంటికో సైనికుడు.. ఆర్మీ అంటే వీరికి ప్రాణం

Published Sun, Apr 14 2024 8:00 AM

- - Sakshi

యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం.. అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నేటి యువత కూడా సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోంది. ఇదీ.. మర్కూక్‌ మండలం గంగాపూర్‌ ప్రత్యేకత. ఇక్కడి ప్రజల జీవన విధానంపై ఈ ఆదివారం ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం..

యెన్నెల్లి సురేందర్‌–గజ్వేల్‌:  రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్‌’లతో గంగాపూర్‌ గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం 50కిపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ‘రాజ్‌పుత్‌’లో దేశభక్తి ఎక్కువ. అందువల్లే ఇక్కడి యువత సైన్యంలో చేరుతుంటారు. ఇప్పటికే 25మంది సైన్యంలో పనిచేస్తుండగా.. కొందరు పదవీ విరమణ పొందారు. గ్రామానికి చెందిన పంచిగారి యశ్వంత్‌ సింగ్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. నోచోనియా భవానీసింగ్‌, పంచిగారి నరేష్‌సింగ్‌, పంచిగారి రూప్‌సింగ్‌, అత్తర్‌సుమ నర్సింగ్‌, జుగ్‌రాజ్‌ గణేష్‌సింగ్‌, నోన్‌వార్‌ గణేష్‌సింగ్‌, నోన్‌వార్‌ భవానీసింగ్‌, నోన్‌వార్‌ సత్యనారాయణసింగ్‌, రామ్‌చరణ్‌సింగ్‌లు ఆర్మీలో పనిచేస్తున్నారు.

యూసుఫ్‌ఖాన్‌పల్లిలోనూ...

ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న యూసుఫ్‌ఖాన్‌పల్లిలోనూ మరో 20కుపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి కూడా మరో 15మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మిగతావారు వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గంగాపూర్‌ ప్రస్తుతం యూసుఖాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకే వస్తుంది.

రాజేంద్రనగర్‌ఎస్‌ఐగా..

ఇదే గ్రామానికి చెందిన జుగ్‌రాజ్‌ నారాయణసింగ్‌ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కాగా పంచిగారి రామ్‌సింగ్‌, అత్తర్‌సుమ అనంతరామ్‌సింగ్‌, నోచునోయి హిరామన్‌, అనంతరామ్‌సింగ్‌, అత్తర్‌సుమ రాజారామ్‌సింగ్‌, ప్రకాష్‌సింగ్‌లు సైతం ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరే కాకుండా మరో ఏడుగురికిపైగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత యువకులు ఇండియన్‌ ఆర్మీలో చేరడానికి ఉత్సాహంతో ఉన్నారు.

వ్యవసాయమే జీవనాధారం
వ్యవసాయమే వీరికి జీవనాధారం. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. యువత ఆర్మీలో చేరుతుండగా.. కొందరు స్థానికంగా కంపెనీలు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నిరుపేదలు ఏటా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తుంటారు. అలాగే కూలీపనులకు కూడా వెళ్తుంటారు.

దేశ సేవంటే ఇష్టం

మా ఊరు ఇచ్చిన ప్రేరణతోనే నేను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి నాకు దేశ సేవంటే మహా ఇష్టం. నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా గ్రామంలో చాలా మంది ఆర్మీలో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. మా ఊరే అందరికీ ఆదర్శం.

– పంచిగారి యశ్వంత్‌ సింగ్‌, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, రాజస్థాన్‌

ఇక్కడివారితో కలిసిపోయాం
తా
తముత్తాలు గంగాపూర్‌కు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడివారితో కలిసి పోయాం. వారే మాకు ఆత్మీయులు. ఏ వేడుక అయినా అందరం కలిసి చేసుకుంటాం. వ్యవసాయం జీవనాధారం. ఎంతోమంది పిల్లలు ఆర్మీలో చేరడం సంతోషం.
– శంకర్‌సింగ్‌, గంగాపూర్‌

ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది
దే
శ సేవ చేసేందుకు ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. 2023లో ఆర్మీలో చేరాను. మా గ్రామంలో నాతోపాటు ఎంతోమంది ఉన్నారు. వారి సలహాలు, సూచనలతో ఉద్యోగంలో చేరి సేవ చేస్తున్నాను.
– పంచిగారి నరేశ్‌ సింగ్‌, ఆర్మీ పైలెట్‌

శిక్షణ ఇస్తే మరింత మేలు
దే
శ సేవ చేసే అదృష్టం ఆర్మీలో దక్కుతుంది. మా గ్రామం నుంచి ఎక్కువ మంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి ఏటా కొందరు యువకుల ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– దుర్జన్‌సింగ్‌, ప్రైవేట్‌ లెక్చరర్‌, గంగాపూర్‌

1/1

Advertisement
Advertisement