కారు చీకట్లకు కారణాలేంటి? | - | Sakshi
Sakshi News home page

కారు చీకట్లకు కారణాలేంటి?

Dec 5 2023 5:30 AM | Updated on Dec 5 2023 5:30 AM

- - Sakshi

మెదక్‌: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్లు మెదక్‌లో ‘కారు’ ఓటమికి కారణాలు అనేకం అని పలువురు నేతలు, మేధావులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధిలో మెదక్‌ వెనుక బాటుతనంపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నా, పాలక పక్షం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. మెదక్‌, సిద్దిపేట పక్కపక్కనే ఉన్నా మెతుకుసీమ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పోయింది. సిద్దిపేట మెడికల్‌ కళాశాలతో పాటు రింగ్‌రోడ్లు, కోమటి చెరువు పర్యాటకం, ఆక్సిజన్‌ పార్కులతో అభివృద్ధి చెందినా.. మెదక్‌కు మెడికల్‌ కళాశాల పేపర్‌పై రాతలుగానే మిగిలిపోయింది. అంతే కాకుండా మహిళా డిగ్రీ కళాశాల, మార్క్‌ఫెడ్‌, ఫారెస్టు తదితర ప్రభుత్వ కార్యాలయాలు మెదక్‌ నుంచి సిద్దిపేటకు తరలిపోయాయి. ఇవన్నీ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటమికి ముఖ్య కారణంగా విశ్లేషిస్తున్నారు.

2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ మెదక్‌లో ప్రచారం చేస్తూ తాను అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మూతపడిన ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట ఇచ్చారు. పదేళ్లు పూర్తియినా పట్టించుకోకపోవడం, మెదక్‌ చుట్టూ రింగ్‌రోడ్డు వేస్తానని మర్చిపోవడం, ఘణాపూర్‌ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నట్లు నిధులు విడుదల చేశామని చెప్పినా పనులు జరగకపోవడం, పాపన్నపేటల నుంచి ఎల్లారెడ్డికి కలిపే ఎంకిపల్లి బ్రిడ్జి నిర్మాణంలో తీవ్రజాప్యం, ఏడుపాయల ఈవో చేసిన అక్రమాలు సైతం మెడకు చుట్టుకోవడం, ప్రభుత్వ సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డి తలదూర్చడం కొంప ముంచిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయపై అధికారులు సైతం బహిరంగంగా వ్యతిరేకించిన ఘటనలు చాలా ఉన్నాయి.

హస్తం వైపు మొగ్గు..

చిన్నశంకరంపేట మండలంలోని అనేక గ్రామాలకు రోడ్లు మంజూరైనా వాటికి నిధులు మంజూరుకాక పోవడంతో బీఆర్‌ఎస్‌కు పట్టున్న గ్రామాల్లో సైతం రెండో స్థానానికి పరిమితమయ్యారు. అందులో చిన్నశంకరంపేట మండలం జంగారియితో పాటు అనేక పల్లెల్లో హస్తం వైపుకే మొగ్గు చూపారు. కాగా నెలన్నర పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావుకు మెదక్‌ వెనకబాటు తనం ఒక అస్త్రంగా దొరికింది. ఆ ప్రాంత వెనుక బాటు తనానికి సిద్దిపేట నాయకుల పెత్తనమే కారణమని నేరుగా హరీశ్‌రావును టార్గెట్‌ చేశారు. అభివృద్ధిలో జరిగిన అన్యాయంపై హరీశ్‌రావు లాంటి నాయకుడిని వేలెత్తి చూపిన నేత ఇప్పటి వరకు మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావులేనని చెప్పక తప్పదు. ఆ ప్రాంత అభివృద్ధికి అలాంటి నాయకుడే కావాలని, అభివృద్ధి విషయంలో అధిష్టానం నుంచి నిధులు తేవాలంటే మైనంపల్లితోనే సాధ్యమని నియోజకవర్గ ప్రజలు హస్తానికి పట్టం కట్టారు.

పనిచేయని ప్రలోభాలు..

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే హరీశ్‌రావు నేతృత్వంలో నాయకులకు ప్రలోభాలు చూపి పార్టీలో చేర్పించుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలందరినీ వరుస క్రమంలో బీఆర్‌ ఎస్‌లో చేర్చుకున్నారు. ఎన్నికలు దగ్గర పడగానే డబ్బు, మద్యంతో ప్రజలను మత్తులో ముంచినా అవేవీ పనిచేయలేదని పలువురు నేతలు, విశ్లేషకులు వివరిస్తున్నారు.

అభివృద్ధిపై ప్రజల అసంతృప్తి

మెదక్‌ నుంచి కార్యాలయాల తరలింపు

ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యం

కొంప ముంచిన ఎమ్మెల్యే భర్త పెత్తనం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement