
స్వాధీనం చేసుకున్న నగదు
● ల్యాబ్ అనుమతుల కోసం లంచం డిమాండ్ ● డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వైనం
మెదక్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన సతీష్ స్థానికంగా ఫిజియో థెరపీ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం నెల రోజుల కింద ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు వెళ్లి అవసరమైన సర్టిఫికెట్‌లు, బ్యాంక్ డీడీలు అందజేశాడు. ఈ సందర్భంగా ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలపడంతో చేసేది లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఫహీం పాషా పట్టణంలోని ఓ హోటల్ వద్ద సతీష్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్‌లు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫహిం పాషాను అదుపులోకి తీసుకుని కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు తరలించి విచారణ జరిపారు. ఈ ఘటనలో ఇంకెవరిదైనా పాత్ర ఉందా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్