చిన్నారులకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు ఘన స్వాగతం

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం

అడ్మిషన్ల పెంపు, మెరుగైన ఫలితాలు లక్ష్యం

72 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ

ప్రారంభం రోజనే విద్యార్థులకు నోట్‌, పాఠ్యపుస్తకాలు

‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

మంచిర్యాలఅర్బన్‌: ‘ప్రతీ విద్యార్థి ఆనందంగా పాఠశాలకు రావాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. బోధన నాణ్యత పెంపు.. మెరుగైన ఫలితాల కోసం టీచర్లకు మార్గదర్శకాలు ఇచ్చాం. సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంపు.. డ్రాపౌట్‌ లేకుండా చిన్నారులు బడిబాట పట్టేలా కార్యాచరణ చేపట్టాం’ అని జిల్లా విద్యాధికారి చంద్రయ్య అన్నారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వసతిగృహాలు, రెసిడెన్షియల్‌, ప్రభుత్వ పాఠశాలలు అందంగా అలంకరించి విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

‘బడిబాట’లో విద్యార్థుల నమోదు..

జిల్లాలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రైమరీలో 15,311, అప్పర్‌ ప్రైమరీలో 4419, సెకండరీలో 15,637, హయ్యర్‌ సెకండరీలో 7,705 మంది విద్యార్థులున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించాం. నాలుగేళ్లు నిండిన చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేలా అంగన్‌వాడీల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామసభలు, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం, సామూహిక అక్షరాభాస్యం, విలీన విద్య, బాలల సభ, బాలికా విద్య, తరగతిగదుల డిజిటలీకరణ, క్రీడాపోటీల నిర్వహణ, సర్కారు బడుల్లో బోధన, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేపట్టడం ద్వారా విద్యార్థుల నమోదు పెంచనున్నాం.

వందశాతం ట్రాన్సిషన్‌, జీరో డ్రాపౌట్‌

ప్రతీ ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో ఐదు, ఏడు, ఎనిమిది తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చేర్పించి సంబంధిత పాఠశాల హెచ్‌ఎం యుడైస్‌లో సటూండెట్‌ మాడ్యుల్‌లో ఇంపార్ట్‌ చేయించాలి. విద్యార్థుల నూతన పాఠశాల, ప్రవేశ వివరాలు మండల విద్యాధికారి నిర్ణీత ప్రొఫార్మాలో స్కూల్‌ కాంప్లెక్‌ హెచ్‌ఎం ద్వారా సమర్పించాలి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఇష్టానుసారం ఏదైనా జూనియర్‌ కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థి చదివిన పూర్వ పాఠశాల, నూతన పాఠశాల, కళాశాల హెడ్స్‌ ఇద్దరూ యుడైస్‌లో డ్రాప్‌ బాక్స్‌లో ఏఒక్క విద్యార్థి ఉండకుండా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రతీ విద్యార్థి యుడైస్‌లో నమోదై ఉండేలా నవీకరించాలి.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత

పాఠశాల పున:ప్రారంభమైన రోజున ప్రతీ విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందుతుంది. ఆయా పాఠశాలలకు బియ్యం సరఫరా జరిగింది. పాఠశాల హెచ్‌ఎం, కమిటీ సభ్యులు మధ్యాహ్న భోజనం రుచి, శుచిపై టెస్టీ చేయాల్సిందే.

ప్రారంభం రోజే పుస్తకాలు

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే నోట్‌, పాఠ్యపుస్తకాలు అందిస్తాం. జిల్లాకు 3,12,986 నోట్‌ పుస్తకాలు చేరాయి. 3,05,620 పాఠ్యపుస్తకాలకు 2,86,3400 వచ్చాయి. ఎనిమిదో తరగతి బయోలజీ, రెండో తరగతి ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. గ్రౌండ్‌ బ్యాలెన్స్‌ కలుపుకుని మొత్తం 3,05,620 పుస్తకాలు (100 శాతం) ఆయా పాఠశాలలకు చేరాయి. గ్రామస్థాయిలో సర్పంచులు, అమ్మ ఆదర్శ కమిటీలు, మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం వల్ల బడుల్లో ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది. కేజీబీవీలకు యూనిఫాం క్లాత్‌ త్వరలోనే అందనుంది.

పరిశుభ్రత, పారిశుద్ధ్యం

అమ్మ ఆదర్శ కమిటీ, స్కూల్‌ ఫెసిలిటీ అండ్‌ మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ నుంచి పారిశుద్ధ్య నిర్వహణ కోసం శానిటేషన్‌ వర్కర్స్‌ను నియమించుకోవాలి. అవసరమైతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ సిబ్బందిని వినియోగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశాం. వేసవి సెలవుల్లో పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి విషపూరిత కీటకాలు సంచరించే ప్రమాదం ఉంది. తాగునీటి ట్యాంకులు పాకురుతో నిండి ఉంటాయి. ఇంకా ఒకరోజు సమయం ఉంది. తరగతి గదులు, పరిసరాలు, నీటి ట్యాంకులు, వంటపాత్రలు శుభ్రపర్చుకోవాలని ఆదేశించాం.

బోధన నాణ్యతలో పెంపునకు చర్యలు

గతేడాది విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌, పాఠ్యప్రణాళికలు రాయడం, అభ్యసన సామర్థ్యాలపై విపులంగా శిక్షణ ఇచ్చాం. ఉన్నత పాఠశాలలకు లిప్‌పై, ప్రధానోపాధ్యాయులకు బోధన తీరు పర్యవేక్షణపై అవసరమైన తర్ఫీదు ఇచ్చాం. ప్రాథమిక పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఐదు ఇన్‌స్పెక్షన్‌ టీంలు, ఉన్నత పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు రెండు తనిఖీ బృందాలు నియమించాం. బడిబాట ముగిసిన తర్వాత బృందాలకు కేటాయించిన మండలాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతో వ్యవస్థలో జాగరుకత, బాధ్యత పెరిగి ప్రణాళికాబద్ధమైన బోధనలో నాణ్యత, అభ్యసన సామర్థ్యాలలో పెరుగుదల, పాఠశాలల పనితీరులో పురోగతి సాధ్యమవుతుంది.

మౌలిక వసతులు..

టీచర్ల సర్దుబాటు

డిజిటల్‌ విద్య..

ఫీజుల వివరాలు ప్రదర్శించాలి

మౌలిక సదుపాయాలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో 545 పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులు పూర్తయ్యాయి.

జిల్లాలో 2,464 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. తక్కువ విద్యార్థులుండి ఎక్కువ ఉపాధ్యాయులుంటే మరో పాఠశాలకు సర్దుబాటు చేశాం. గతేడాది 168 మందిని వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేశాం. ఎక్కడైనా ఖాళీలుంటే కలెక్టర్‌ అనుమతితో సర్దుబాటు చేస్తాం.

జిల్లాలోని 576 ప్రాథమిక పాఠశాలల్లో టాప్స్‌ ద్వారా, 138 ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌సీ తెరల ద్వారా బోధన జరుగుతోంది. 71 పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. 119 పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాల నోటీస్‌ బోర్డులో స్కూల్‌ అనుమతి, ఉత్తర్వుల ప్రతిని, వివరాలు, పాఠశాల గవర్నింగ్‌ బాడీ అనుమతించిన తరగతి వారీగా విద్యార్థుల నుంచి సేకరించే ట్యూషన్‌ ఫీజు, ఇతర ఫీజుల వివరాలను విధిగా ప్రదర్శించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement