క్యాతనపల్లి మున్సిపాల్టీలో ఉత్కంఠకు తెర
చైర్‌పర్సన్‌గా సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సరిత ఏకగ్రీవం
ఓటింగ్‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు
బీఆర్‌ఎస్, సీపీఐ కూటమికి మెజార్టీతో
లాంఛనప్రాయంగా ఎన్నిక
భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాల్టీలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ఎట్టకేలకు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య రెండుసార్లు వాయిదా పడ్డ ఎన్నికలు చివరికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తయ్యాయి. మొత్తం 22 స్థానాలకు గాను ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి 14, కాంగ్రెస్ పార్టీ ఏడు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్, సీపీఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరుకావడం.. అందులో కోరం కూడా స్పష్టంగా ఉండడంతో ఎన్నికల ప్రత్యేకాధికారి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ గంటన్నర వ్యవధిలో పూర్తయింది. బీఆర్‌ఎస్‌కు చెందిన గొడిసెల సంధ్యారాణి చైర్‌పర్సన్‌గా, సీపీఐకి చెందిన మిట్టపల్లి సరిత వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సమావేశ మందిరంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాతనపల్లి ఫ్‌లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బీఆర్‌ఎస్–సీపీఐ శ్రేణుల సంబురాలు..
మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్–సీపీఐ కూటమి దక్కించుకోవడంతో ఆ పార్టీల శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. దాదాపు 51 రోజులపాటు కుటుంబాలను వదిలి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుని ఎన్నికల రోజు శనివారం ఉదయం నేరుగా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి చేరారు. భారీ కాన్వాయ్‌తో ఇక్కడికి చేరుకున్న అనంతరం 12గంటల ప్రాంతంలో బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి సుమన్ ఇంటి వద్దకు చేరుకోగా పార్టీ శ్రేణులు భారీగా సంబురాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. దాదాపు నెలన్నర రోజులకు పైగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈ ఎన్నికలతో తెరపడగా.. మంత్రి వివేక్ ఇలాకాలో క్యాతనపల్లి పీఠాన్ని బీఆర్‌ఎస్–సీపీఐ కూటమి దక్కించుకోవడం స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.


